INDIA vs BANGLADESH: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా షెడ్యూలు చాలా బిజీగా ఉండనుంది. మెగా టోర్నీ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌ బయల్దేరనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును బంగ్లా క్రికెట్‌ బోర్డు విడుదల చేసింది.


డిసెంబర్‌ అంతా!


టీమ్‌ఇండియా డిసెంబర్‌ మొత్తం బంగ్లాదేశ్‌లోనే ఉండనుంది. డిసెంబర్‌ 1న అక్కడికి వెళ్తుంది. 4, 7, 10న మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచులన్నీ ఢాకాలో జరుగుతాయి. డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు తొలి టెస్టుకు ఛాతోగ్రామ్‌లోని జహుర్‌ అహ్మద్‌ చౌదరీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. ఆ తర్వాత టీమ్‌ఇండియా మళ్లీ ఢాకాకు వస్తుంది. 22 నుంచి 26 వరకు రెండో టెస్టు ఆడుతుంది. 27న భారత్‌కు బయల్దేరుతుంది.


అప్పుడు బంగ్లాదే విక్టరీ


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగానే ఈ రెండు టెస్టులు జరుగుతాయి. ప్రస్తుతం WTC2లో టీమ్‌ఇండియా 52.08 పర్సంటేజీ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 13.33 పర్సంటేజీ పాయింట్లతో బంగ్లాదేశ్ ఆఖర్లో నిలిచింది. చివరిసారిగా 2015లో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించింది. అప్పుడు జరిగిన ఏకైక టెస్టు డ్రా అవ్వగా మూడు వన్డేల సిరీసును ఆతిథ్య జట్టు 2-1తో గెలిచింది.


నువ్వా నేనా!


భారత్‌, బంగ్లా మ్యాచులు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని బంగ్లా క్రికెట్‌ బోర్డు (BCB) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ అన్నారు. 'ఈ మధ్యన భారత్‌, బంగ్లా మ్యాచులు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. అందుకే రెండు దేశాల అభిమానులు మరో చిరస్మరణీయ సిరీసు కోసం ఎదురు చూస్తున్నారు. బీసీబీతో సన్నిహతంగా పనిచేస్తూ ఈ సిరీసు షెడ్యూలును ధ్రువీకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు. బంగ్లాకు భారత జట్టును స్వాగతించేందుకు మేం ఎదురు చూస్తుంటాం' అని ఆయన పేర్కొన్నారు.


అవును.. నిజమే!


రెండు దేశాల మధ్య పోటాపోటీ మ్యాచులు జరుగుతున్న విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జేషా అంగీకరించారు. 'టీమ్‌ఇండియాతో ద్వైపాక్షిక  సిరీసు ఆడబోతున్న బంగ్లాదేశ్‌కు అభినందనలు. భారత్‌, బంగ్లా మ్యాచులపై అభిమానులకు ఆసక్తి పెరిగింది. బంగ్లా అభిమానులు ఎంత అభిరుచితో ఉంటారో మాకు తెలుసు. రెండు ఫార్మాట్లలో బంగ్లా ధాటిగా ఆడుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్లు ఉన్నాయి కాబట్టి రెండు జట్లు ఎంతో కష్టపడతాయి' అని ఆయన తెలిపారు.


బంగ్లాదేశ్‌లో భారత పర్యటన


డిసెంబర్ 4 - ఢాకాలో తొలి వన్డే
డిసెంబర్ 7 - ఢాకాలో రెండో వన్డే
డిసెంబర్ 10 - ఢాకాలో మూడో వన్డే
డిసెంబర్ 14-18 : ఛాతోగ్రామ్‌లో తొలి టెస్టు
డిసెంబర్ 22-26 : ఢాకాలో రెండో టెస్టు