IND VS ENG 1st Test: హైదరాబాద్‌(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India)కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌(England)తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్‌ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించి బ్రిటీష్‌ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. భారత జట్టు ఓటమితో రోహిత్‌ సేన ఆటతీరుపై మాజీలు మండిపడ్డారు. ఇదేం ఆటతీరంటూ విమర్శలు గుప్పించారు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి ఎదురుకావడం అభిమానులకు మింగుడుపడడం లేదు. ఈ ఓటమితో టీమిండియా ఓ అపఖ్యాతిని మూటగట్టుగుంది.




 

ఈ పరాజయంతో..

టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. విదేశాల్లో కలుపుకున్నా ఇది మూడోసారి మాత్రమే. 2015లో గాలె టెస్టులో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 192 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌‌తో జరిగిన టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో టీమిండియాకు ఎదురైన ఓటమి గత 12 ఏళ్లలో స్వదేశంలో మూడోది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో వీరిద్దరు 100కుపైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. అలాగే టెస్టు క్రికెట్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. 

 

మరీ ఇంత డిఫెన్సీవ్‌గానా...

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) విమర్శించాడు. పోప్‌ వంటి బ్యాటర్‌ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్‌ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదన్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్‌ చేసి ఉంటే బాగుండేదన్న డీకే... టీమిండియా ఆటతీరు విస్మయానికి గురి చేసిందన్నాడు. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదని రవిశాస్త్రి(Ravi Shastri) అన్నాడు. రోహిత్‌ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్‌ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని కూడా అన్నాడు.

 

హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమి..అనేక ప్రశ్నలను లేవనెత్తింది. బ్రిటీష్‌ జట్టును స్పిన్‌తో చుట్టేదామనుకున్న రోహిత్‌ సేన పన్నిన వ్యూహం మనకే ఎదురు తిరిగింది.