భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో 2 ఆతిథ్య ఇంగ్లాండ్ నెగగ్గా, భారత్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. ఇప్పుడు రెండు జట్లు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ మైదానంలో తలపడనున్నాయి. అయితే రికార్డులు భారత్ కు అంత సానుకూలంగా లేవు. భారత జట్టు ఇప్పటివరకూ మైదానంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇటీవల రెండో టెస్టులోనే అదే మాట వినిపించింది. కానీ యువ ఆటగాళ్లతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.


నాలుగో టెస్టు జరగనున్న మాంచెస్టర్ లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది. లేకపోతే నాలుగో టెస్ట్ ఓడితే భారత్ సిరీస్ చేజారిపోతుంది. ఓవైపు తర్వాత టెస్టులో విజయాల గురించి కంటే ఎవరు గాయపడ్డారు, ఎవరు అందుబాటులో ఉంటారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గాయంతో ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండరు. రిషబ్ పంత్ విషయానికొస్తే ఫిట్ నెస్ లేదు. భారత్ లో అరుదైన ఆటగాడిగా ఉన్న ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇలా ఆడితే జట్టు విజయాలు కాదు కదా, కనీసం డ్రా చేసుకోవడం కష్టమే.


కరుణ్ నాయర్ లేదా సాయి సుదర్శన్.. నంబర్‌ 3లో ఎవరు?


నాల్గవ టెస్ట్‌లో రిషబ్ పంత్ ఆడటం కష్టమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతడు ఫిట్ నెస్ సమస్యతో బాధ పడుతున్నాడు. ఒకవేళ మాంచెస్టర్ టెస్టులో పంత్ బరిలోకి దిగితే కేవలం బ్యాటర్‌గా ఆడనున్నాడు. ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తూ జట్టుకు మంచి స్కోర్లు అందిస్తున్నారు. ఆ తర్వాత నెం.3లో కొత్త కుర్రాడు సాయి సుదర్శన్‌కు అవకాశం దొరుకుతుంది. అయితే, రిషబ్ పంత్ ప్లేయింగ్ ఎలెవన్ లో కాకపోతే వీరిలో ఒకరికి జట్టులో చోటు దక్కుతుంది.  


వాషింగ్టన్ సుందర్ లేదా శార్దూల్ ఠాకూర్.. 


మాంచెస్టర్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరికి ఛాన్స్ అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి, పిచ్ మీద గడ్డి ఉంది. అంటే ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి సహకారం దొరుకుతుంది. కానీ సుందర్ మూడవ టెస్ట్‌లో బాగా రాణించాడు. దీనిని మనం విస్మరించలేము. కనుక సుందర్ ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కించుకుంటే శార్దూల్ కు మరోసారి నిరాశే.


అన్షుల్ కంబోజ్ అరంగేట్రం ఖాయమా..


ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓ మ్యాచ్ ఇన్నింగ్స్ లో 10కి 10 వికెట్లు తీసిన ఘనత అన్షుల్ కంబోజ్ సొంతం. ఇంగ్లాండ్ లో ఆటగాళ్ల గాయాలు, ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ యువ ఫాస్ట్ బౌలర్‌కు అరంగేట్రం చేసే అవకాశం దొరుకుతుందని మాజీ క్రికెటర్లు సైతం భావిస్తున్నారు. ఆకాష్‌ దీప్ మ్యాచ్ ఫిట్‌గా లేకపోతేనే కంబోజ్ ప్లేయింగ్ లెవన్ లో భాగమవుతాడు. ఆకాష్‌దీప్ పూర్తిగా ఫిట్‌గా ఉంటే, అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం వాయిదా పడుతుంది. 


నాల్గవ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ అంచనా- యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), జడేజా, శార్దూల్ ఠాకూర్/ వాషింగ్టన్ సుందర్, సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా , అన్షుల్ కంబోజ్/ ఆకాష్‌దీప్.