మాంచెస్టర్: బుధవారం నుండి మాంచెస్టర్లో ప్రారంభమయ్యే నాల్గవ టెస్ట్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. మూడో టెస్టులో విజయానికి దగ్గరగా వచ్చిన సమయంలో తాను ఔట్ కావడం బాధించిందన్నాడు. బుమ్రాపై వర్క్ లోడ్ దృష్టిలో ఉంచుకుని, సిరీస్ ప్రారంభానికి ముందే బీసీసీఐ యాజమాన్యం ఈ ఫాస్ట్ బౌలర్ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని పేర్కొంది. ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిన సమయంలో భారత అభిమానులకు ఇది ఉపశమనం కలిగించే విషయం. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు గాయపడిన కారణంగా అన్షుల్ కంబోజ్‌కు జట్టు నుంచి పిలుపు వచ్చింది.
బుమ్రా ఆడిన 2 టెస్టుల్లోనూ భారత్ ఓటమి
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ మూడు టెస్టులు పూర్తికాగా, 1-2తో సిరీస్‌లో వెనుకంజలో ఉంది. కనుక, సహజంగానే బుమ్రా ఆడాలని తోటి ఆటగాళ్లతో పాటు క్రికెట్ ప్రేమికులు కోరుకుంటారు. అతను మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని సిరీస్ కు ముందే మేనేజ్ మెంట్ అతడి వర్క్ లోడ్ తగ్గించే ప్రయత్నం చేసింది. మరోవైపు జస్ప్రిల్ బుమ్రా ఆడిన తొలి, మూడవ టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయింది. బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. దాంతో కీలకమైన నాలుగో టెస్టులోనూ బుమ్రా అందుబాటులో ఉంటాడని కన్ఫామ్ అయింది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరగనున్న నాలుగో టెస్టులో నెగ్గి సిరీస్ ను 2-2తో సమం చేయాలని శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు భావిస్తోంది.
ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తేనే వికెట్లు
సోమవారం హైదరాబాదీ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. "నాకు తెలిసినంతవరకు నాలుగో టెస్టులో బుమ్రా ఆడతాడు. కొత్త పేసర్ ఆకాష్‌దీప్‌కు నడుము నొప్పి సమస్య. అతడి ఫిట్ నెస్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఆ విషయాలులు ఇప్పుడు ఫిజియో చూసుకుంటారు. వచ్చే టెస్టు కోసం ప్రస్తుతం కూర్పు మారుతోంది. సరైన ప్రదేశంలో బంతులు సంధిస్తే వికెట్లు లభిస్తాయి. అందుకోసం సరైన ప్లాన్, బౌలింగ్ అటాక్ ఉండాలి" అన్నాడు.
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన సిరీస్ మ్యాచ్‌ల నుండి వైదొలిగాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) సోమవారం నాడు ధృవీకరించింది. నితీష్ ఈ సిరీస్ లో మొదటి టెస్ట్‌లో ఆడలేకపోయినా రెండు, మూడు టెస్టుల్లో ఆడాడు. గాయంతో అతడు స్వదేశానికి తిరిగి వెళ్తాడు. బర్మింగ్‌హామ్‌లో ఈ ఆల్ రౌండర్ ప్రదర్శన అంత బాగా లేదు, కాని లార్డ్స్‌లో బంతితో రాణించాడు. అతడి స్థానంలో మరో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇస్తారా అని చర్చ జరుగుతోంది.
పేసర్లను వెంటాడుతున్న గాయాలు
నాలుగో టెస్టులో జట్టులోకి వస్తాడనుకున్న ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దాంతో అతడు కూడా నాల్గవ టెస్ట్ నుండి వైదొలిగాడు. ప్రసిద్ కృష్ణ పేలవ ప్రదర్శన, అర్ష్‌దీప్, ఆకాష్ దీప్‌లకు గాయాలు కావడంతో కొత్త పేసర్ అన్షుల్ కాంబోజ్ నాలుగో టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.