Ind Vs Eng Anderson- Tendulkar Trophy Test Series Latest Updates: భారత వర్దమాన ఏస్ పేసర్ అన్షుల్ కాంభోజ్ లక్కు తలుపు తట్టినట్లుగానే ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో తను టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంగా కనపడుతోంది. ఆ మ్యాచ్ ఆడితే, టీమిండియా తరపున తన తొలి మ్యాచ్ కానుంది. సడెన్ గా ముగ్గురు పేసర్లు గాయపడటంతో అన్షుల్ కు టీమిండియాలోకి ఎంట్రీ సులభమైంది. తొలుత అర్షదీప్ సింగ్ నెట్ లో గాయపడటంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ తొడ కండరాల గాయంతో అసౌకర్యంగా ఉండటంతో అతను మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు లో జరిగే నాలుగో టెస్టులో ఆడటం డౌట్ గా మారింది. మూడో టెస్టులో కీలక మూడు వికెట్లు పడగొట్టిన పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి.. గాయంతో మొత్తానికి సిరీస్ కు దూరం కావడం కూడా అన్షుల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసింది.
కఠోర శ్రమ..
శనివారమే జట్టుతో చేరిన అన్షుల్.. ఆదివారం మాంచెస్టర్ ఫుట్ బాల్ టీమ్ తో ఆడిన భారత జట్టులో సభ్యునిగా ఉన్నాడు. ఇక సోమవారం జరిగిన ట్రైనింగ్ సెషన్లో తీవ్రంగా కసరత్తు చేశాడు. ముఖ్యంగా కొత్తబంతితో ముమ్మరంగా సాధన చేసి, సరైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లతోపాటు పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో ముచ్చటించాడు. అలాగే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ కు బౌలింగ్ కూడా చేస్తూ, చాలా బిజీగా కనిపించాడు. దీంతో తను నాలుగో టెస్టులో ఆడటం ఖాయంగా మారిందని చెప్పవచ్చు.
ట్రైనింగ్ లో ప్రసిధ్, ఆకాశ్ దీప్..
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆకాశ్ దీప్ కూడా ఫిట్ నెస్ టెస్టులో పాల్గొన్నాడు. ఆ తర్వాత కాసేపు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కాసేపు బౌలింగ్ చేసినప్పటికీ, అతను కాస్త అసౌకర్యంగా కనిపించాడు. అలాగే ప్రసిధ్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసినప్పటికీ, తను జట్టు ప్రణాళికల్లో ఉన్నట్లు కనిపించలేదు. దీంతో నాలుగో టెస్టుకు వీరిద్దరూ దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత బౌలింగ్ దళాన్ని పరిశీలించినట్లయితే జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కచ్చితంగా ఆడనున్నారు. వీరికి తోడుగా అన్షుల్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పిచ్ స్వభవాన్ని పట్టి, కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశముంది. మరోవైపు నాలుగో పేసర్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ ను తప్పించి, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను ఆడించే అవకాశాలను తోసిపుచ్చలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.