Ind Vs Eng Test Series Latest Updates: ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డులో జరిగే నాలుగోటెస్టుకు ఇంగ్లాండ్ జట్టు తమ ప్లేయింగ్ లెవన్ ప్రకటించింది. మ్యాచ్ కు రెండు రోజుల ముందుగానే జట్టును ప్రకటించే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించింది. అయితే జట్టులో కీలకమార్పు చేసింది. అందరూ అనుకున్నదే అయినా, ఇంగ్లాండ్ జట్టు మాత్రం చేసిన ఈ మార్పుతో ఆ జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ముఖ్యంగా గాయంతో టెస్టు సిరీస్ కు దూరమైన షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ని తీసుకుంది. స్లో లెఫ్టార్మ్ ఆర్తో డాక్స్ బౌలర్ అయిన డాసన్ చేరికతో ఆ జట్టు లోయర్ ఆర్డర్ కాస్త పటిష్టంగా మారింది. ఇక ఐదు టెస్టుల అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో తొలి, మూడో టెస్టు గెలిచిన ఇంగ్లాండ్ 2-1 తో ఆధిక్యంలో నిలిచింది.మరోవైపు రెండో టెస్టు మాత్రమే గెలిచిన భారత్, సిరీస్ లో సజీవంగా ఉండాలంటే నాలుగో టెస్టును గెలవడం లేదా.. డ్రా చేసుకోవాలి. అప్పుడే ఇంగ్లాండ్ కు సిరీస్ దక్కకుండా ఉండేందుకు అవకాశముంటుంది.
పోటీని తట్టుకుని..నిజానికి బషీర్ స్థానంలో రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హార్ట్ లీ పోటీ పడినా, కౌంటీల్లో చాలా అనుభవం ఉన్న డాసన్ కే ఇంగ్లాండ్ ఓటేసింది. తను చివరిసారిగా 2017లో సౌతాఫ్రికాపై టెస్టు ఆడాడు. అయితే ఇప్పటివరకు తను మూడు టెస్టులు ఆడగా, కేవలం ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే దేశవాళీల్లో అతను నిలకడగా రాణిస్తుండటంతో, తిరిగి రీ ఎంట్రీ దక్కింది. నిజానికి లెఫార్మ్ స్పిన్నరైన డాసన్.. వికెట్ కు వికెట్ అక్యూరెట్ గా బౌలింగ్ చేయగలడు. ఇక అతడికి బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది. 35 ఏళ్ల డాసన్ ఇప్పటివరకు 212 మ్యాచ్ లు ఆడగా, 371 వికెట్లు తీశాడు. సగటు 31.5 కావడం విశేషం. ఇక బ్యాటింగ్ లో 35కి పైగా సగటుతో 56 ఫిఫ్టీలు, 18 సెంచరీలు కూడా చేశాడు.
భారత్ కు గాయాల బెడద..చావో రేవోలాంటి మ్యాచ్ లో భారత్ ను గాయాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా చేతి వేలి గాయంతో లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ను స్క్వాడ్ నుంచి తప్పించారు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్ ఆడనున్నాడు. మరో పేసర్ ఆకాశ్ దీప్ సింగ్ కూడా నాలుగో టెస్టులో ఆడటం అనుమానమే. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో తను ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. ఇక గాయంతో తెలుగు కుర్రాడు, నితీశ్ రెడ్డి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇలా కీలకమైన నాలుగో మ్యాచ్ కు ముందు ఆటగాళ్ల దూరం కావడం జట్టు మేనేజ్మెంట్ ను కలవరపరుస్తోంది. అసలు జట్టు కూర్పు ఏవిధంగా ఉండాలో అని టీమ్ మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. బుధవారం టాస్ తర్వాత గానీ, టీమిండియా ప్లేయింగ్ లెవన్ పై స్పష్టత రాదు.
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, హేరీ బ్రూక్, బ్రైడెన్ కార్స్, జాక్ క్రాలీ, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్.