WTC Finals Latest Updates: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు ఉన్న క్రేజే వేరు.. ఇప్పటివరకు మూడు సార్లు ఈ టోర్నీ ఫైనల్ ను ఇంగ్లాండ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 2021లో సౌతాంప్టన్ లో ఇండియాపై న్యూజిలాండ్, 2023లో ద ఓవల్లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలవగా, 2025లో లార్డ్స్ లో జరిగిన ఫైనల్లో ఆసీస్ పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే 2027-31 మధ్య జరిగే మూడు ఫైనల్స్ ను కూడా ఇంగ్లాండ్ లోనే నిర్వహించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే మూడుసార్లు ఈ ఫైనల్స్ ను నిర్వహించిన ఇంగ్లాండ్ కి..మరో మూడుసార్లు నిర్వహించేందుకు బంపర్ ఆఫర్ వచ్చినట్లయ్యింది. మరోవైపు ఈ ఫైనల్స్ ను నిర్వహించేందుకు భారత్, ఆసీస్ ప్రయత్నించినా, ఐసీసీ మాత్రం ఇంగ్లాండ్ లోనే నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఇందుకు గల కారణాలను విశ్లేషకులు ఏకరువు పెడుతున్నారు..
అందుకేనా..?నిజానికి ఇంగ్లాండ్ లో టెస్టు క్రికెట్ కు అద్బుతమైన క్రేజ్ ఉంది. సూటు బూటు వేసుకుని ఇంగ్లాండ్ అభిమానులు మ్యాచ్ లని వీక్షిస్తారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లాంటి మ్యాచ్ లకు అయితే పోటెత్తుతారు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్ లో తమ జట్టు తుదిపోరుకు చేరకపోయినా, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ వేదికలకు వచ్చి, టెస్టులను ఆస్వాదించారు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ పోరును ఇక్కడే నిర్వహించాలని ఐసీసీ నిర్వహించింది. ఇటీవలే సింగపూర్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించగా, తాజాగా దీనిపై ప్రకటన వెలువడింది.
భారత్ లో ఎందుకు జరగడం లేదంటే..!నిజానికి ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ ని నిర్వహించేందుకు బీసీసీఐ కూడా ఆసక్తి చూపించింది. ఐసీసీ చైర్మన్ గా బోర్డు మాజీ కార్యదర్శి జై షా ఉండటంతో ఈసారి ఇండియాకు అనుకూలంగా నిర్ణయం జరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఒకవేళ ఇండియా ఫైనల్ కు చేరకపోతే, రెస్పాన్స్ పూర్ గా ఉంటుందని ఐసీసీ భావించి, వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అలాగే సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఉద్రిక్తతలు ఉండటం వల్ల కూడా ఐసీసీ తాజా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక డిఫెండిగ్ చాంపియన్ గడ్డపైనే ఫైనల్ ను నిర్వహించాలని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వాదించినా ఫలితం లేక పోయింది. వేర్వేరు వేదికల్లో, భిన్న పిచ్ లపై ఈ టోర్నీని నిర్వహిస్తే బాగుంటుందని కూడా కొంతమంది మాజీలు సూచించినా, ఐసీసీ దాన్ని తోసిపుచ్చింది. మరో మూడు ఎడిషన్లు అంటే 2027, 2029, 2031లలో ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ లోనే జరుగనుంది.