India World Cup Squad 2023: 2011 తర్వాత  స్వదేశంలో జరుగుతున్న  ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే  భారత క్రికెట్ జట్టును  బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ప్రపంచకప్ నెగ్గి పుష్కరకాలం (చివరిసారి ధోని సారథ్యంలో 20‌11 వన్డే వరల్డ్ కప్ గెలిచింది)  దాటిన నేపథ్యంలో అక్టోబర్ నుంచి భారత్‌లోనే జరుగబోయే ఈ మెగా టోర్నీని గెలుచుకోవాలని  టీమిండియా  భావిస్తున్నది. భారత్ చివరిసారి 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గేందుకు గాను భారత్  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది.  ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్న ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ  చీఫ్ అజిత్ అగార్కర్‌తో కలిసి టీమిండియా సారథి  రోహిత్ శర్మ భారత జట్టును ప్రకటించారు.  


భారత వరల్డ్ కప్‌ టీమ్‌లో అందరూ ఊహించినట్టుగానే భారీ మార్పులైతే  చోటు చేసుకోలేదు. లాస్ట్ మినిట్ ఛేంజెస్ కూడా ఏమీ లేవు.  సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపగా  జట్టులో చోటు ఆశించిన తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలకూ ఛాన్స్ దక్కలేదు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించిన కెఎల్ రాహుల్  వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించాడు.  అశ్విన్,  వాషింగ్టన్ సుందర్, అర్ష్‌‌దీప్ సింగ్‌లు ఎంట్రీ ఉంటుందని  వార్తలు వచ్చినా వాళ్లెవరూ ఎంపికకాలేదు.


ఇటీవల ప్రకటించిన ఆసియా కప్‌కు ఎంపికైన  జట్టులో  స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని  ఇదివరకే అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ హింట్ కూడా ఇచ్చారు.  అందరూ అనుకున్నట్టుగానే ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌లోని ముగ్గురు సభ్యులను తొలగించి  15 మంది సభ్యులను ప్రకటించింది బీసీసీఐ.. 


టీమ్ ఇదే.. 


రోహిత్ శర్మ సారథిగా ఉండే భారత జట్టులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,  శ్రేయాస్ అయ్యర్‌లు  పూర్తిస్థాయి బ్యాటర్లు.  వికెట్ కీపర్ బ్యాటర్‌గా కెఎల్ రాహుల్ ఎంపిక  కాగా అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు.  సీమ్ ఆల్ రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా.. స్పిన్ ఆల్ రౌండర్లుగా  రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది.   స్పిన్నర్‌గా  కుల్దీపన్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా  ముగ్గురు సీమర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్‌లు భారత బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.  బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్  కూడా చోటు దక్కించుకున్నాడు. 


తుది జట్టు కూర్పు ఎలా ఉండనున్నా..  వరల్డ్ కప్‌లో భారత జట్టులో ఐదుగురు బ్యాటర్లు,  ఒక సీమ్ ఆల్ రౌండర్, వికెట్ కీపర్ బ్యాటర్,  స్పిన్ ఆల్ రౌండర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. పిచ్, పరిస్థితులకు తగ్గట్టు తుది జట్టులో మార్పులు ఉండొచ్చు.


 






వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్  పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial