India ODI World Cup Squad 2023: పదేండ్ల తర్వాత పూర్తిగా స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు  గాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు 15 మంది సభ్యులతో కూడిన జట్టును  ప్రకటించనుంది.  ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్న సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో పాటు  టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌లు భారత జట్టును ప్రకటించే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే  ఆ 15 మంది ఎవరు..? అన్నది  ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.  వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించేందుకు  నేడే (సెప్టెంబర్ 5) ఆఖరు తేదీ.. మంగళవారం మధ్యాహ్నం 1 తర్వాత భారత జట్టు ప్రకటన వెలువడే అవకాశముంది. 


వన్డే వరల్డ్ కప్ కోసం ఈ ఏడాది   జనవరిలోనే  బీసీసీఐ.. 20 మందితో కూడిన కోర్  గ్రూప్‌ను  ఎంపికచేసింది.  అయితే ఇందులో వడపోతలు, తీసివేతలు, కూడికలు పోనూ 15 మంది సభ్యులను నేడు  ప్రకటించనుంది.   చాలాకాలంగా భారత జట్టుతో ఉంటున్నా  కేరళ  ఆటగాడు  సంజూ శాంసన్‌కు ఈ ప్రపంచకప్‌లోనూ  చోటు దక్కేది అనుమానమేనని వార్తలు వస్తున్నాయి.  వన్డేలలో తడబడుతున్న  సూర్యకుమార్ యాదవ్,  నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్‌లకు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కే అవకాశముంది. ఆసియా కప్‌లో ఎంపిక చేసిన తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలతో పాటు  మరో రెండు మార్పులు కూడా ఉండే అవకాశమున్నట్టు సమాచారం. శార్దూల్ ప్లేస్ ‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. 


రోహిత్ కామెంట్స్.. 


వన్డే వరల్డ్ కప్ టీమ్ ప్రకటన నేపథ్యంలో   నేపాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత   టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆస్తికకర వ్యాఖ్యలు చేశాడు. భారీ మార్పులైతే ఉండవని.. ఒకటి రెండు మార్పులు మాత్రమే ఉంటాయని  హింట్ ఇచ్చాడు. రోహిత్ మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడికి వచ్చినప్పుడే  వరల్డ్ కప్‌‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ను ఎంపిక చేశాం.  ప్రస్తుతం ఆసియా కప్‌కు ఎంపికైన టీమ్ ఒకటి రెండు మార్పులు తప్ప భారీ   మార్పులైతే ఉండవు.  అదీగాక మేం ఇక్కడ (ఆసియా కప్) ఆడిన రెండు మ్యాచ్‌లూ పూర్తిస్థాయిలో ఆడలేకపోయాం. ఒకటి వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దైంది.  మరోదాంట్లో కూడా పూర్తిగా ఆడలేకపోయాం.  మా అత్యుత్తమ ఆట అయితే  బయటకు రాలేదు.  కానీ కొంతమంది ఆటగాళ్లు చాలాకాలంగా జట్టుకు తమ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. దాని ప్రకారమే వరల్డ్ కప్ టీమ్ ఎంపిక ఉంటుంది’ అని తెలిపాడు. 


వరల్డ్ కప్  టీమ్‌లో  ఐదుగురు బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగనున్నట్టు సమాచారం. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ భారాన్ని మోస్తారు.  కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు.  ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. ఆల్ రౌండర్ల స్థానంలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా  అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది.  పేసర్లుగా  జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ  బౌలింగ్ భారాన్ని మోస్తారు.  కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా సేవలందించనున్నాడు.  అయితే  అశ్విన్‌ను గానీ  వాషింగ్టన్ సుందర్‌ను గానీ చేర్చితే భారత బ్యాటింగ్‌లో లోతు పెరగడంతో పాటు  ఎక్స్‌ట్రా స్పిన్ ఆప్షన్ కూడా దొరికే అవకాశమున్నట్టు  సెలక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 


వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్  పాండ్యా,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial