Gautam Gambhir: భారత్ - పాకిస్తాన్ మధ్య మూడు రోజుల క్రితం పల్లెకెలె వేదికగా జరిగిన కీలక మ్యాచ్ వర్షార్పణం కాగా ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించిన టీమిండియా మాజీ ఓపెనర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ చేసిన ఓ చిన్న చర్య వివాదాస్పదమైంది. వర్షం కారణంగా మ్యాచ్ అర్థాంతరంగా రద్దు కావడంతో గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్తున్న గంభీర్‌ను ఉద్దేశిస్తూ పలువురు విరాట్ కోహ్లీ అభిమానులు ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరిచారు. అది గమనించిన గంభీర్ వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయితే గంభీర్ కావాలనే అలా చేశాడని, ఇది కోహ్లీని అవమానించినట్టేనని అతడి అభిమానులు సామాజిక మాధ్యమాలలో బీజేపీ ఎంపీపై దుమ్మెత్తిపోశారు.
గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు.
గంభీర్ స్పందిస్తూ... ‘మ్యాచ్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రాజకీయ నినాదాలు చేయొద్దు. నేను నా రూమ్‌కు వెళ్తుండగా అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. అంతేగాక కాశ్మీర్ గురించి కూడా నినాదాలు చేస్తుంటే నేను మౌనంగా ఉంటానని అనుకోకూడదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియలో ఎప్పుడూ ఏ విషయాన్ని పూర్తిగా చూపించదు..’ అని స్పష్టం చేశాడు. కోహ్లీ.. కోహ్లీ అని అరిచినప్పుడు మాత్రమే తాను అలా వేలు చూపించానని చెప్పడానికి సంబంధమే లేదని గంభీర్ తెలిపాడు.
కోహ్లీ ఫ్యాన్స్ నినాదాలకు గంభీర్ రెస్పాండ్ అవడం ఇదే తొలిసారి కాదు. వీళ్లిద్దరి మధ్య విభేదాల గురించి అందరికీ తెలిసిందే. కోహ్లీ కెరీర్ ఆరంభంలోనే ఐపీఎల్‌లో గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. తర్వాత కోహ్లీ విఫలమైన ప్రతీసారి గంభీర్ అతడిపై ఘాటు విమర్శలు చేసేవాడు. వీళ్లిద్దరి మధ్య గొడవ ఈ ఏడాది పీక్స్‌కు వెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్‌తో కోహ్లీ గొడవపడగా తనకు సంబంధం లేని విషయంలో గంభీర్ వేలుపెట్టి నానా రచ్చ చేశాడు. ఐపీఎల్-16కు వీళ్లిద్దరి గొడవ ఓ కళంకంగా మారింది. ఆ తర్వాత కూడా కోహ్లీ ఫ్యాన్స్‌ను గంభీర్ పలుమార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ - 16 సందర్భంగా హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు ఈ ఇద్దరూ విభేదాలు పక్కనెట్టాలని సూచించిన విషయం తెలిసిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial