సఫారీ గడ్డపై టీ 20సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే గాయాలు భారత జట్టును వేధిస్తుండగా ఇప్పుడు మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షమీ జట్టుకు దూరమైన కొన్ని రోజులకే టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.. ఇషాన్ కిషన్ స్థానంలో కె. ఎస్. భరత్ ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ... దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా  కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది. 

గాయంతో రుతారాజ్‌ అవుట్‌!

మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్‌ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భార‌త ఆట‌గాళ్లు ద‌క్షిణాఫ్రికా వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్రన్ అశ్విన్‌, న‌వ‌దీప్ సైనీ, హ‌ర్షిత్ రాణా ద‌క్షిణాఫ్రికాలో ఉన్నారు. 

ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం. అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ష‌మీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.

ఇప్పటికే మరోవైపు భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌ నుంచి దూరమయ్యాడు. షమీకి BCCI వైద్య బృందం క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో అతడికి టెస్ట్‌ జట్టు నుంచి విశ్రాంచి ఇచ్చారు. చీల‌మండ‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మీ... ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది. అందుకే ద‌క్షిణాప్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు షమీ దూరం అయ్యాడు. ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు.