దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా(Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ (Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కొనుగోలు చేసింది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో ఫ్రాంఛైజీ(Franchise) ఆటగాళ్ల కోసం రూ.100 కోట్ల పర్సు ఉంటుంది. అందులో దాదాపు 25 శాతం ఒక్క ప్లేయర్ కోసమే వెచ్చించడం ఎంత వరకు కరెక్టని కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ స్టార్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. దీనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.
షాక్ అయిపోయా...
మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్‌కు అంత భారీ ధర పలకడానికి గల కారణాలేంటో అర్థం కావడం లేదంటూ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. వారిద్దరూ మంచి ఆటగాళ్లే కానీ వారిపై ఇంత భారీ ధర వెచ్చించడం మాత్రం షాకింగ్‌గా అనిపిస్తోందని అన్నాడు. ముంబై, చెన్నైతోపాటు ఇతర ఫ్రాంచైజీలు వేలంలో తెలివిగానే వ్యవహరించాయని మిస్టర్ 360 అన్నాడు. కానీ కమిన్స్, స్టార్క్ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా ఇంత భారీ ధర లభించడం నమ్మశక్యం కావడం లేదన్నాడు. వేలంలో ఫాస్ట్ బౌలర్లకు భలే డిమాండ్ ఉన్నట్లు అనిపించిందన్నాడు. ఈ సారి వేలంలో ముంబై సైలెంట్‌గా కొనుగోళ్లు చేసిందని డివిలియర్స్ అన్నారడు. నువాన్ తుషారా, దిల్షాన్ మదుశంక, గెరాల్డ్ కోయిట్జీ వంటి పేసర్లను ముంబై ఇండియన్స్ తెలివిగా దక్కించుకుందని... వీరు బుమ్రాకు అదనపు సైన్యంగా పనికొస్తారని అన్నాడు. ప్రధానంగా గెరాల్డ్ కోయిట్జీ బంతిపై పూర్తిస్థాయి నియంత్రణ కలిగి ఉంటాడని.. అలాంటి బౌలర్‌ను కేవలం రూ. 5 కోట్లకే ముంబయి సొంతం చేసుకుందన్నాడు.
మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్‌కు అంత భారీ ధర పలకడంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆర్సీబీ(RCB)ని వీడి వేలం బరిలో నిలిస్తే రూ.42 కోట్ల ధర పలుకుతాడని ఆకాశ్ చోప్రా అన్నాడు. మిచెల్ స్టార్క్ మొత్తం 14 గేమ్‌లు ఆడి పూర్తి కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే అతడు వేసే ఒక్కో బంతి విలువ సుమారు రూ.7,60,000 అవుతుందని... ఇది ఆశ్చర్యకరంగా ఉందని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అని. అతడికి రూ.12 కోట్లు చెల్లిస్తే స్టార్క్‌కి దాదాపు రూ.25 కోట్లు ఇస్తున్నారని ఆకాశ్ అన్నాడు. ఇలా చేయడం తప్పన్నాడు. మహమ్మద్ షమీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్లు స్టార్క్, కమిన్స్ కంటే తక్కువ మొత్తం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు.