ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 98 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత మహిళలు... ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌... సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. స్మృతి మంధాన.. స్నేహ్‌ రాణ మంచి బ్యాటింగ్‌తో అలరించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు  50 పరుగులు జోడించారు. కానీ తొమ్మిది పరుగులు చేసిన స్నేహ్‌ రాణా అవుటైంది. దీంతో 140 పరుగుల వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది.

 

అర్ధ శతకాల హోరు 

ఆ తర్వాత కాసేపటికే సెంచరీ దిశగా సాగుతున్న స్మృతి మంధాన రనౌట్‌ అయింది.  106 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసిన స్మృతి మంధాన అనవసరంగా రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 147 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రిచా ఘోష్‌, జెమిమా రోడ్రిగ్స్‌ అద్భుతంగా ఆడారు. జెమీమా రోడ్రిగ్స్ 73, రిచా ఘోష్ 52  పరుగులతో అర్ధ శతకాలు బాదారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపారు. కానీ శతకం దిశగా సాగుతున్న రోడ్రిగ్స్‌ను గార్డెనర్‌... రిఛా ఘోష్‌ను గార్త్‌ పెవిలియన్‌కు పంపారు. యస్తికా భాటియా ఒక పరుగుకే వెనుదిరగగా...కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ డకౌట్‌ అయింది. దీంతో భారత్‌ భారీ ఆధిక్యం సాధించలేదేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ, దీప్తి శర్మ-పూజా వస్త్రాకర్ మాత్రం ఆసీస్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌ చేశారు. సెంచరీ భాగస్వామ్యం నిర్మించి క్రీజులో పాతుకుపోయారు. దీప్తి శర్మ 70 పరుగులతో... పూజా వస్త్రాకర్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా రెండో రోజూను సంతృప్తిగా ముగించింది. ఇప్పటికే టీమిండియా 157 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. దీంతో భారత మహిళలు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు. ఆసీస్‌ బౌలర్లు గార్డెనర్ 4, కిమ్‌ గార్త్‌, జొనాసెన్ ఒక్కో వికెట్‌ తీశారు.

 

తొలి ఇన్నింగ్స్‌ సాగిందిలా,....

 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కంగారులు తొలుత బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 219 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 77.4 ఓవర్లలో 219 పరుగుల వద్ద ముగించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ నాలుగు, స్నేహ్‌ రాణా 3, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడ్డ భారత ఓపెనర్లు... తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 59 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 40 పరుగులు చేసింది. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా షెఫాలీని జొనాసెన్  వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.  స్నేహ్‌రాణా ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి క్రీజులో ఉంది. ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు ఒక వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. ఒక వికెట్ తీసింది. భారత్‌ ఇంకా 121 పరుగులు వెనుకబడి ఉంది.