IND vs SA Match Highlights: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఉంది. అతి కీలకమైన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీతో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. గత మ్యాచ్ మ్యాచ్ మాదిరిగానే భారత్‌ను తక్కువ పరుగులకే అవుట్ చేయాచ్చన సఫారీల వ్యూహం ఫలించలేదు. వాళ్లు తీసుకున్న నిర్ణయం తప్పు అని తేలింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇందులో తిలక్ వర్మ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విజృంభించి 56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. తిలక్ వర్మతోపాటు అభిషేక్ శర్మ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
భారత ఓపెనర్ సంజూ శాంసన్ ఈసారి నిరాశ పరిచాడు. 2 బంతుల్లో పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా తొందరగానే పెవిలియన్ బాట పట్టారు. సూర్యకుమార్ యాదవ్ 4 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రింకూ సింగ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. రింకూ సింగ్ 13 బంతుల్లో 8 పరుగులు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో రమణదీప్ సింగ్ 6 బంతుల్లో 18 పరుగులు చేశఆడు. అక్షర్ పటేల్ 1 బంతికి 1 పరుగు రాబట్టాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లు ఆండిలే సిమెలే, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ 1 వికెట్ తీసుకున్నాడు. గెరాల్డ్ కోయెట్జీ, లూథో సింపాలా, కెప్టెన్ ఐడాన్ మార్కమ్ వికెట్ల వేటలో వెనకబడ్డారు.
సెంచూరియన్‌లో భారత్‌కు తొలి విజయం
220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేయగలిగింది, ఈ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సన్ మినహా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. మార్కో జాన్సన్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. హెన్రిక్ క్లాసెన్ కూడా 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 29 పరుగులు చేశాడు. రీజా హెండ్రిక్స్ 21 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
భారత్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి టైం చూసి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు పెవిలియన్ పంపించారు. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇలా సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయానికి అందరూ తమ వంతు పాత్ర పోషించారు. ఇంతకుముందు ఈ మైదానంలో భారత జట్టు 1 టీ20 మ్యాచ్ ఆడి ఓడిపోయింది.
టీ20Iలో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో అతి చిన్న వయసు వ్యక్తి
దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ T20Iలో తిలక్ వర్మ 51 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీలో తిలక్ వర్మ కూడా 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అంతకుముందు తిలక్ వర్మ కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 ఏళ్ల తిల్కర్ వర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. తిలక్ వర్మ 22 ఏళ్ల 5 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.