Ind-W vs Pak-W T20 WC: భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మైదానంలోనే కాదు బయటా ఉత్కంఠ, ఉద్వేగం హై పిచ్ లో ఉంటాయి. అది పురుషుల మ్యాచ్ అయినా.. మహిళల మ్యాచ్ అయినా గ్రౌండ్ లో క్రికెటర్లు విజయం కోసం పోరాడతాయి. అయితే తమ మధ్య పోటీ మైదానంలో మాత్రమే.. బయట మేమంతా స్నేహితులం అని తరచూ ఆటగాళ్లు చెప్తూ ఉంటారు. మరోసారి అది నిజమే అని భారత్- పాక్ మహిళా క్రికెటర్లు నిరూపించారు.
మైదానంలో ఆట కోసం మాత్రమే తాము పోటీ పడతామని.. ఒక్కసారి మ్యాచ్ పూర్తయి బయటకొస్తే తామంతా స్నేహితుల్లా సన్నిహితంగా ఉంటామని నిరూపిస్తున్నారు భారత్- పాక్ మహిళా క్రికెటర్లు. నిన్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా దాయాదుల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస్థాన్ 149 పరుగులు చేయగా.. 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే మ్యాచ్ అనంతరం ఇరు దేశాల క్రికెటర్ల మధ్య జరిగిన సంభాషణలు, సెల్ఫీలు, ముచ్చట్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
సెల్ఫీలు, జోకులు
మ్యాచ్ అనంతరం భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణం అందరినీ ఆకట్టుకుంటోంది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు దేశాల ఆటగాళ్లు కొందరు సెల్ఫీలు దిగుతూ కనిపించారు. మరికొందరు ముచ్చట్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. మైదానంలో ఈ రెండు దేశాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ బయట వారు ఒకరి కంపెనీని మరొకరు ఆస్వాదిస్తూ కనిపించడం వారి మధ్య బంధాన్ని సూచిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను పాక్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ లో పంచుకుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
పాకిస్థాన్ మహిళల తుది జట్టు
జవేరియా ఖాన్, మునీబా అలీ(వికెట్ కీపర్), బిస్మాహ్ మరూఫ్(కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్
భారత మహిళల తుది జట్టు
షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.
ఒక ఓవర్లో 7 బంతులు
భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టీ20లో ఒక పొరపాటు జరిగింది. భారత ఛేదనలో ఏడో ఓవర్లో పాక్ బౌలర్ నిదాదర్ 7 బంతులు వేసింది. అందులో ఒక్కటి కూడా వైడ్, నోబాల్ లాంటి ఎక్స్‌ట్రాల్లేవు. అయినప్పటికీ అదనంగా మరో బంతి వేయడం చర్చనీయాంశం అయింది. ఓవర్లో బౌలర్ వేసిన బంతులను అంపైర్ సరిగ్గా లెక్క పెట్టకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ ఎక్స్ ట్రా బంతికి జెమీమీ రోడ్రిగ్స్ ఫోర్ కొట్టింది.