Border Gavaskar Trophy: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ టెస్ట్ వేదిక ధర్మశాల నుంచి మారింది. ఈ మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ స్పష్టంచేసింది.
మార్చి 1 నుంచి భారత్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ లో భాగంగా ఈ టెస్ట్ ధర్మశాల వేదికగా జరగాలి. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ను ఇండోర్ కు మార్చారు. ఎందుకంటే ప్రస్తుతం ధర్మశాల మైదానంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఔట్ ఫీల్డ్ ను పునర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయినప్పటికీ ఇంకా పిచ్ ను పరీక్షించలేదు. అలాగే ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. మూడో టెస్టుకు ఇంకా 2 వారాల సమయమే ఉన్నందున మ్యాచ్ ను ధర్మశాల నుంచి మార్చుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఒకే ఒక టెస్ట్ మ్యాచ్
ధర్మశాలలోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అక్కడి పిచ్ ను పునర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభించారు. ధర్మశాలలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో భారత్ - ఆస్ట్రేలియాలే మధ్యే ఈ టెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ వన్డేలు, టీ20లు బాగా జరుగుతాయి. అలాగే వచ్చే వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు ఈ స్టేడియం వేదిక కానుంది.
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగ్ భారత్- ఆస్ట్రేలియాలు 4 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్నాయి. ఇప్పటికే మొదటి టెస్ట్ పూర్తయింది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభం కానుంది. మార్చి 1 నుంచి మూడో టెస్ట్ జరుగుతుంది. మార్చి 9 నుంచి 13 వరకు చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది.
టెస్ట్ సిరీస్ తర్వాత భారత్- ఆస్ట్రేలియాలు వన్డే సిరీస్ లో తలపడనున్నాయి.
తొలి టెస్టులో భారత్ ఘనవిజయం
తొలి టెస్టులో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంలో మరోసారి తమ బలహీనతను బయటపెట్టుకున్న కంగారూలు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించిన వేళ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
రోహిత్ రికార్డ్
ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.