IND vs BAN, 2nd T20I: బ్యాటింగ్‌లో విఫలమైనా  భారత మహిళల క్రికెట్ జట్టు బౌలింగ్‌లో మెరిసి  బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసి  బ్యాటర్ల వైఫల్యంతో 95 పరుగులే చేసినా  భారత  స్పిన్నర్లు సమిష్టిగా రాణించి టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీని అందించారు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి పది పరుగులు అవసరం కాగా.. షఫాలీ వర్మ వేసిన ఈ ఓవర్‌లో ఏకంగా  నాలుగు వికెట్లు  పడగొట్టి ఆ జట్టును ఆలౌట్ చేయడమే గాక భారత్‌కు సిరీస్‌ను అందించింది.  96 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 87 పరుగులకే ఆలౌట్ అయింది.  


బంగ్లా బౌలర్ల ధాటికి విలవిల..


ఢాకా వేదికగా నేడు ముగిసిన రెండో టీ20లో టాస్ గెలిచిన  టీమిండియా మొదలు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (14 బంతుల్లో 19, 4 ఫోర్లు),  స్మృతి మంధాన (13 బంతుల్లో 13, 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలో 33 పరుగులు జోడించారు.  ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్నట్టే కనిపించినా  ఇదే స్కోరు వద్ద భారత్‌కు ట్రిపుల్ షాక్ తాకింది. 4వ ఓవర్ రెండో బంతికి నహీదా అక్తర్.. మంధానను బౌల్డ్ చేయగా  తర్వాతి ఓవర్లో సుల్తానా ఖాటూన్ వరుసగా షఫాలీ, హర్మన్‌ప్రీత్ (0) లను ఔట్ చేసింది.  కొద్దిసేపటికే  యస్తికా భాటియా (11) ను ఫహియా ఔట్ చేయగా  జెమీమా రోడ్రిగ్స్ (8)ను  రబెయ ఖాన్ పెవిలియన్‌కు పంపింది. హర్లీన్ డియోల్ (6)ను కూడా సుల్తానా ఔట్ చేసింది. ఆ తర్వాత కూడా  భారత లోయరార్డర్ పెద్దగా రాణించలేదు. దీంతో భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 


మిన్ను మణి కేక..


స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు కూడా బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. టీమిండియా తరఫున రెండో టీ20 ఆడుతున్న కేరళ అమ్మాయి మిన్ను మణి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆమె వేసిన రెండో ఓవర్‌లోనే బంగ్లా ఓపెనర్ షమీమా సుల్తానా (5) షఫాలీకి క్యాచ్ ఇచ్చింది. మరో ఓపెనర్ శాతి రాణి (5) ని దీప్తి శర్మ ఔట్ చేసింది. ఆంధ్రా (అనంతపురం)  అమ్మాయి బారెడ్డి అనూష.. ముర్షీదా ఖాన్ (4)ను బౌల్డ్ చేసింది.   ఆ వెంటనే మిన్ను మణి.. రీతూ మోని (4)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.  దీంతో  బంగ్లా 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 


ఆదుకున్న నైగర్ సుల్తానా.. 


చేయాల్సిన లక్ష్యం తక్కువే ఉన్నా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుండటంతో కెప్టెన్  నైగర్ సుల్తాన్(55 బంతుల్లో 38, 2 ఫోర్లు) ఒంటరిపోరాటం చేసింది.  భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కుని  బంగ్లాను పోటీలోకి తెచ్చింది.  ఆమెకు సహకారం అందించేవారు కరువైనా బంగ్లా స్కోరుబోర్డును విజయం దిశగా పరుగులెత్తించింది.  శ్రోనా అక్తర్ (7) తో కలిసి ఐదో వికెట్‌కు 24 పరుగులు జోడించిన ఆమె.. తర్వాత నహిదా అక్తర్ (6) తో కూడా 22 పరుగులు జతచేసింది. కానీ దీప్తి శర్మ.. శ్రోనాను ఔట్ చేసి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చింది. ఒంటరిపోరాటం చేసిన నైగర్ కూడా దీప్తి వేసిన 19వ ఓవర్లో ఆఖరి బంతికి ఔట్ అయింది. 


 






షషాలీ సంచలనం.. 


19వ ఓవర్ ముగిసేటప్పటికీ బంగ్లాదేశ్ స్కోరు 86-6. చేతిలో నాలుగు వికెట్లు. మిగిలున్న బంతులు ఆరు.. చేయాల్సిన పరుగులు 10. ఇది 20వ ఓవర్ ముందు సమీకరణం.  హర్మన్‌ప్రీత్.. షఫాలీకి బంతినిచ్చింది.  తొలి బంతికి రెండో పరుగు తీయబోతూ రబెయా ఖాన్ (0) రనౌట్. రెండో బంతికి నహీదా అక్తర్.. షఫాలీకే క్యాచ్ ఇచ్చింది. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి ఫాహీమా ఖాటూన్  డకౌట్. ఐదో బాల్‌కూ పరుగు రాలేదు. ఆఖరి బంతికి  మరూఫా అక్తర్.. ముందుకొచ్చి  ఆడబోగా  యస్తికా స్టంపౌట్ చేసింది.   ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.


ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2‌-0తో గెలుచుకుంది. సిరీస్‌లో నామమాత్రమైన మూడో టీ20 ఈనెల 13న ఇదే వేదికపై జరుగనుంది.   



























Join Us on Telegram: https://t.me/abpdesamofficial