Harbhajan Singh: కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారాపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ కోసం ఎంతో చేసిన అతడిని ఇలా తప్పించడం సరికాదని, అతడి కంటే దారుణమైన ప్రదర్శన ఉన్నవారిని కొనసాగిస్తూ పుజారాను తప్పించడంపై భజ్జీ అసహనం వ్యక్తం చేశాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. ‘పుజారా మీద నాకు అపారమైన గౌరవం ఉంది. టీమ్ కోసం అతడు ఎంతో చేశాడు. చాలాఏండ్లుగా జట్టులో ఉండి మెరుగైన ప్రదర్శనలు చేసినా గుర్తింపురాని హీరో అతడు. టీమిండియా టెస్టులలో స్ట్రాంగ్ టీమ్‌గా ఎదగడానికి అతడి కృషి మరువలేనిది. ఫామ్ లేమిని చూపెట్టి అతడిని జట్టులోంచి తప్పించినా పుజారాపై కొంత అయినా గౌరవం చూపెడితే బాగుండేది. పరుగులు చేయడం లేదని అతడిని తొలగించారు సరే.. మరి టీమ్‌లో పుజారాతో పాటు మరికొంతమంది బ్యాటర్లు కూడా చాలాకాలంగా ఆడటం లేదు కదా. మరి వాళ్లనెందుకు తీసేయలేదు’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యల ద్వారా భజ్జీ.. విరాట్ కోహ్లీని టార్గెట్ చేశాడని అతడి అభిమానులు వాపోతున్నారు. కోహ్లీ కూడా టెస్టులలో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
ఈ ఏడాది మార్చిలో ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోపీతో పాటు గతనెలలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పుజారా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతడిని తప్పించారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కొత్త తరం ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ తరఫున రహానే, శార్దూల్ ఠాకూర్ మినహా మిగిలిన ఏ ఒక్క ఆటగాడు కూడా అర్థ సెంచరీ సాధించలేకపోయాడు. రోహిత్, గిల్, కోహ్లీలు దారుణంగా విఫలమయ్యారు. అయినా సెలక్టర్లు మాత్రం పుజారాను తప్పించడం కరెక్ట్ కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసినవారిలో పుజారానే టాప్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి సగటు 32.13గా ఉంది. పుజారా అవసరం భారత జట్టుకు ఇంకా ఉందని, విదేశాలలో ఆడేప్పుడు అతడే భారత బ్యాటింగ్ కు ప్రధాన బలం అని హర్భజన్ తెలిపాడు. ‘పుజారా విషయంలో మనం నిత్యం వినే ఒకటే ఆరోపణ అతడి స్ట్రైక్ రేట్. కానీ పుజారా డిఫెన్స్ వల్ల చాలా మ్యాచ్ లలో భారత్‌ను కాపాడింది. దీని ప్రకారం.. టీమ్‌కు ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో సెలక్టర్లు చూడాలి. భారత జట్టుకు పుజారా అవసరం ఇంకా ఉంది. విదేశాలకు వెళ్లినప్పుడు పుజారా వంటి బ్యాటర్ కావాలి. అక్కడి పిచ్‌లకు అనుగుణంగా ఆడేవాళ్లు అవసరం. టెస్టులను టెస్టులలా ఆడే పుజారా లాంటి బ్యాటర్ అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంది..’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్ టూర్‌కు పుజారాను ఎంపిక చేయకపోయేసరికి అతడు దేశవాళీ బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్‌కు ఆడుతున్న పుజారా.. ఇటీవలే సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు కూడా పుజారా.. ఇంగ్లాండ్ లో కౌంటీలు ఆడుతూ మూడు సెంచరీలు చేసిన విషయం విదితమే.