ICC ODI World Cup 2023:  వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా..? లేదా..? అన్నది ఇంకా తేలలేదు. నిన్నా మొన్నటిదాకా తమకు వేదికలను మార్చాలని కోరిన పాక్.. దానికి ఐసీసీ నిరాకరించడంతో  మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది.  భద్రతా కారణాల దృష్ట్యా తమకూ  వరల్డ్ కప్ మ్యాచ్‌లను   తటస్థ వేదికపై నిర్వహించాలని  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరనుంది. 


ఈ మేరకు  డర్బన్ (సౌతాఫ్రికా) వేదికగా ఈ వారం జరుగబోయే  ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) కు  తాత్కాలిక చీఫ్ గా వ్యవహరిస్తున్న జకా అష్రఫ్  ఈ  అంశాన్ని ఐసీసీ ముందుంచనున్నాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్.. తమ దేశానికి రానప్పుడు, వన్డే వరల్డ్ కప్ కోసం తాము టీమిండియాకు ఎందుకు వెళ్తామనే ధోరణిలో ఉన్న పాకిస్తాన్.. ఆసియా కప్ విషయంలో తాము  ఓ మెట్టు దిగినప్పుడు, ప్రపంచకప్‌లో కూడా భారత్ ఇలాగే  చేయాలని పట్టుబడుతోంది. 


ఇదే విషయమై రెండ్రోజుల క్రితం పాకిస్తాన్  క్రీడా మంత్రి ఎహ్సాన్ మజారీ  మాట్లాడుతూ.. ‘ఈ విషయాన్ని (వరల్డ్ కప్ లో తటస్థ వేదికలపై పాకిస్తాన్ మ్యాచ్‌లు) జకా అష్రఫ్ త్వరలోనే జరుగబోయే ఐసీసీ సమావేశంలో లేవనెత్తుతాడు.. పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న ఆసియా కప్ ఆడేందుకు భారత్ మా దేశానికి రానప్పుడు.. మేమెందుకు అక్కడికి వెళ్లి ఆడాలి..?’అని ప్రశ్నించాడు.  


సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సిరీస్‌లు జరగక  దశాబ్దకాలం దాటిపోయింది.  ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్‌ పాకిస్తాన్ లోనే జరగాల్సి ఉన్నా భద్రతా కారణాల దృష్ట్యా దీనిని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న విషయం విదితమే.  పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంక‌లో 9 మ్యాచ్‌లు జరుగబోయే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్  త్వరలోనే విడుదల కానుంది. 


ఇక డర్బన్ మీటింగ్‌కు వెళ్లబోయే పీసీబీ చీఫ్‌తో పాటు  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ తసీర్ కూడా హాజరుకానున్నాడు.  ఈ ఇద్దరూ ఆసియా కప్ ఆడేందుకు భారత్ తమ దేశానికి రాకపోవడంతో పాటు ప్రపంచకప్ లో తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేదిశగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీని కోరనున్నారు.


 






నాలుగు రోజుల క్రితమే  పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. వన్డే వరల్డ్ కప్‌లో పాక్  టీమ్ పాల్గొనడంపై 11 మంది మంత్రులతో హై ప్రొఫైల్ కమిటీని ఏర్పాటుచేశారు.  ఈ కమిటీలో  విదేశాంగ శాఖ  మంత్రి బిలావల్ భుట్టో జదారితో పాటు క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ కూడా ఉన్నారు.  ఈ కమిటీ  కొద్దిరోజుల్లోనే పాక్ ప్రధానికి  నివేదికను అందజేయనుంది.  దాని ప్రకారం  షెహబాజ్   తుది నిర్ణయం తీసుకోనున్నారు.  





















Join Us on Telegram: https://t.me/abpdesamofficial