MSK Prasad: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత జట్టు  మరోసారి ఓడిపోవడంతో  రోహిత్ శర్మ  సారథ్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  పరిమిత ఓవర్లలో ఫర్వాలేదనిపిస్తున్నా టెస్టు క్రికెట్‌లో మాత్రం హిట్‌మ్యాన్ తన మార్కును చూపడం లేదు.  వయసు, ఫిట్‌నెస్ కూడా  రోహిత్‌కు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో  అతడిని  టెస్టు  సారథ్య బాధ్యతలను  యువ ఆటగాడైన శుభ్‌మన్ గిల్‌కు గానీ జట్టులో అనుభవజ్ఞుడైన  అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి.  అయితే టీమిండియా  మాజీ చీఫ్ సెలక్టర్  అయిన ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం..  కెప్టెన్సీ పగ్గాలను తిరిగి కోహ్లీకే అప్పగించాలని అన్నాడు.


ఖేల్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తర్వాత  టెస్టు కెప్టెన్ ఎవరు..? అన్న ప్రశ్నకు  ప్రసాద్ సమాధానమిస్తూ.. ‘విరాట్ కోహ్లీ ఎందుకు కాకూడదు..? టెస్టు జట్టులో ఒకప్పుడు రిజర్వ్ కెప్టెన్‌గా ఉన్న రహానే జట్టులో చోటు కోల్పోతే 18 నెలల తర్వాత తిరిగి టీమ్ లోకి వస్తే అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. మరి కోహ్లీకి తిరిగి టెస్టు  పగ్గాలు ఎందుకు అప్పజెప్పకూడదు..? 


కెప్టెన్సీ గురించి కోహ్లీ మనసులో ఏముందో నాకైతే తెలియదు గానీ ఒకవేళ సెలక్టర్లు రోహిత్‌ను దాటి వేరే వ్యక్తి గురించి ఆలోచించినట్టైతే  వాళ్లు వేరే ఎక్కడికో వెళ్లాల్సిన పన్లేదు. కోహ్లీ రూపంలో వాళ్లకు టీమ్ లోనే బెటర్ ఆప్షన్ ఉంది..’ అని చెప్పాడు. 


 






మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ 


టెస్టులలో విరాట్ కోహ్లీ భారత్ తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు.  మహేంద్ర సింగ్ ధోని  నుంచి  2014లో టెస్టు పగ్గాలు తీసుకున్న  కోహ్లీ.. టీమిండియాకు 68 టెస్టులలో సారథ్యం వహించాడు.  ఇందులో  40 మ్యాచ్‌లను గెలిచాడు. స్వదేశంలో మరే భారత సారథికి సాధ్యం కాని రీతిలో 24 టెస్టులు గెలిచిన కోహ్లీ.. విదేశాల్లో కూడా 15 టెస్టులు గెలిచి సౌరవ్ గంగూలీ (విదేశాల్లో 11 టెస్టు విజయాలు) రికార్డులను బ్రేక్ చేశాడు.  టెస్టులలో కోహ్లీ విజయాల శాతం  58.82 శాతంగా ఉంది. స్వదేశంలో మహేంద్ర సింగ్ ధోని 21 టెస్టులలో విజయాలు సాధించగా.. కోహ్లీ 24 టెస్టులు గెలవడం గమనార్హం. తన సారథ్య హయాంలో కోహ్లీ.. టెస్టులలో విశ్వరూపం చూపాడు.  టెస్టులలో ఇప్పటివరకూ కోహ్లీ 28 సెంచరీలు చేస్తే అందులో కెప్టెన్‌గా చేసినవే 20 కావడం విశేషం. టెస్టులలో కోహ్లీ ఏడు డబుల్  సెంచరీలు చేయగా ఇవన్నీ సారథిగా చేసినవే..


 







Join Us on Telegram: https://t.me/abpdesamofficial