MS Dhoni: తమిళ తంబీలు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకునే  చెన్నై సూపర్ కింగ్స్  సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ -16 గెలిచాక తొలిసారి చెన్నైకి వచ్చాడు. ఇటీవలే తన 42వ పుట్టినరోజును జరుపుకున్న ధోని.. న్యూ లుక్‌తో కనిపించాడు. గడ్డం పెంచిన మహేంద్రుడికి చెన్నై అభిమానులు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు.  


ఎల్‌జీఎం ట్రైలర్ లాంచ్ కోసమే.. 


ఉన్నఫళంగా ధోని చెన్నైలో వాలడం వెనుక బలమైన కారణమే ఉంది.  భార్య సాక్షి సింగ్‌తో కలిసి  చెన్నైకి వచ్చిన ధోని.. నేడు జరుగబోయే ఎల్‌జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్)  సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చాడు.  ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’  బ్యానర్‌లో సాక్షి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.  ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా (లవ్ టుడే ఫేమ్), యోగి బాబు, మిర్చి విజయ్, నదియాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమేశ్ తమిళ్‌మణి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా  ట్రైలర్, ఆడియో లాంచ్  నేటి సాయంత్రం చెన్నైలో జరుగనుంది.


ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తమిళ,  తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు తీసేందుకు సాక్షి రెడీ అవుతోంది. ఎల్‌జీఎం  సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు కూడా  స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 


 






ఆపరేషన్ తర్వాత తొలిసారి.. 


ఐపీఎల్ - 16 లో భాగంగా  చెన్నై వేదికగానే జరిగిన  తొలి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన  తర్వాత సీఎస్‌కే ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్ లో ముగిసిన ఫైనల్ ఉత్కంఠభరితంగా ముగియగా..  రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి చెన్నైకి  ఐదో టైటిల్ అందజేశాడు.   అయితే  ఈ మ్యాచ్ తర్వాత ధోని నేరుగా  ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మోకాలి శస్త్ర చికిత్స  చేయించుకున్నాడు.  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత  నేరుగా రాంచీకి వెళ్లి అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.  మొన్న (జూన్ 7) తన బర్త్ డే సందర్భంగా   తన బిల్డింగ్ నుంచి  అభిమానులకు అబివాదం చేసిన ధోని.. పబ్లిక్  లోకి రావడం కూడా ఇదే ప్రథమం.


వచ్చే ఐపీఎల్‌లో ధోని ఆడతాడా..? లేదా..? అని   చర్చలు జరుగుతున్న వేళ.. నేటి  ట్రైలర్ లాంచ్ సందర్భంగా ధోని దాని గురించి ఏమైనా హింట్ ఇస్తాడేమోనని  అతడి అభిమానులు  ఆసక్తిగా వేచి చూస్తున్నారు.  ఐపీఎల్ - 16 సందర్భంగా  చెన్నై మాజీ ఆటగాడు రైనాతో ధోని.. చెన్నైకి కప్ గెలిపించి  మరో సీజన్ ఆడి రిటైర్ అయిపోతానని  చెప్పిన విషయం తెలిసిందే.  ధోని కోరుకున్నట్టుగానే చెన్నై  ఐదో టైటిల్ గెలిచింది.  మరి ధోని మనసులో ఏముందో..? 



















Join Us on Telegram: https://t.me/abpdesamofficial