Ashes 2023 3rd Test: యాషెస్ సిరీస్‌లో  ‘బజ్‌బాల్’ బోణీ కొట్టింది.  స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న  యాషెస్ టెస్టు సిరీస్‌లో  వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ ఇంగ్లాండ్.. ఎట్లకేలకు  లీడ్స్‌లో  విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఐపీఎల్‌-16లో సన్ రైజర్స్ హైదరాబాద్  తరఫున ఆడిన  హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 75, 9 ఫోర్లు ) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో క్రిస్ వోక్స్  (47 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు), మార్క్ వుడ్ (8 బంతుల్లో 16 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) లు పొరాడి ఇంగ్లాండ్ జట్టుకు ఈ సిరీస్‌లో తొలి విజయాన్ని అందించారు.  ఈ గెలుపుతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.  


స్టార్క్ భయపెట్టినా.. 


251 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు  27-0తో  బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌‌కు  ఆసీస్ వెటరన్ పేసర్ మిచెల్ స్టార్క్ తన అనుభవన్నంతా రంగరించి  పేస్ పదును చూపించాడు. ఓపెనర్ బెన్ డకెట్  (23)ను ఎల్బీగా వెనక్కిపంపిన స్టార్క్.. మోయిన్ అలీ (5)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.  జాక్ క్రాలే (44)ను మిచెల్ మార్ష్  పెవిలియన్‌కు చేర్చగా 21 పరుగులు చేసిన జో రూట్‌ను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు.  ఇంగ్లాండ్ భారీ ఆశలు పెట్టుకున్న  కెప్టెన్ బెన్ స్టోక్స్ (13)ను కూడా స్టార్క్.. ఔట్ చేశాడు.  వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (5) ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 161 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.  లోయరార్డర్ పని పడితే విజయం కంగారూలదే అయ్యేది. 


నిలబడ్డ బ్రూక్.. 


గతేడాది  టెస్టు అరంగేట్రం చేసి  పాకిస్తాన్,  న్యూజిలాండ్ సిరీస్ లలో  వీరబాదుడు బాదిన ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్.. అవసరమైన సమయంలో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో విఫలమైన బ్రూక్.. లీడ్స్‌లో మాత్రం నిలబడ్డాడు. స్టార్క్, కమిన్స్, బొలాండ్ త్రయాన్ని తట్టుకుని  కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రిస్ వోక్స్ అతడికి చక్కటి సహకారం అందించాడు.  ఇద్దరూ కలిసి  ఏడో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్న ఈ ఇద్దరూ  కంగారూలకు  మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.  


 






ఆఖర్లో ఇంగ్లాండ్ విజయానికి  22 పరుగుల దూరంలో   బ్రూక్‌ను  స్టార్క్ ఔట్ చేసినా  మార్క్ వుడ్‌తో కలిసి  వోక్స్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఐదు వికెట్లు తీశాడు.  కమిన్స్, మార్ష్ లకు తలా ఓ వికెట్ దక్కింది.  లీడ్స్ టెస్టు విజయంతో  ఇంగ్లాండ్ సిరీస్‌లో బోణీ చేయడమే గాక సిరీస్‌ను గెలిచే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. ఈ   మ్యాచ్‌లో ఫలితం తేడా కొడితే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడేది. ఇక ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 19 నుంచి  మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది.


సంక్షిప్త స్కోరు వివరాలు : 


ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 263
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 237 
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 237 
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ : 254-7 
ఫలితం : మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం 

















Join Us on Telegram: https://t.me/abpdesamofficial