IND vs WI: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పనైపోయిందని, టెస్టు క్రికెట్‌లో అతడు ఇక ఎంతమాత్రమూ ప్రమాదకర బ్యాటర్ కాదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక క్రికెట్‌లో ‘ఫ్యాబ్ 4’గా పిలుచుకునే స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, విరాట్ కోహ్లీలలో.. మిగిలిన ముగ్గురూ మెరుగ్గా ఆడుతున్నా రన్ మిషీన్ మాత్రం వెనుబడిపోయాడని, అతడిని ఫ్యాబ్ 4 జాబితా నుంచి తప్పిస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘ఫ్యాబ్ 4 ఇక ఎంతమాత్రమూ ఉనికిలో లేదు. ఇక దానిని ఫ్యాబ్ 3 అని పిలుచుకోవడమే బెటర్. ఒకానొక టైమ్‌లో కోహ్లీ, రూట్, స్మిత్, కేన్ విలియమ్సన్‌లను మనం ఫ్యాబ్ 4గా పిలిచేవాళ్లం. ఒకదశలో డేవిడ్ వార్నర్ కూడా ఈ జాబితాలో చేరేందుకు తీవ్రంగా పోటీపడ్డాడు.కానీ టెస్టు క్రికెట్‌లో కోహ్లీ, వార్నర్‌ల ప్రభావం దారుణంగా తగ్గింది. 2014 నుంచి 2019 వరకు మాత్రమే ఫ్యాబ్ 4 ఉనికిలో ఉంది.
టెస్టులలో కోహ్లీ గణాంకాల గురించి మనం మాట్లాడుకుంటే .. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అతడు పీక్స్ చూశాడు. ఆ ఐదేండ్ల కాలంలో కోహ్లీ.. 62 టెస్టులలో 58.71 సగటుతో ఏకంగా 5,695 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు కూడా ఉన్నాయి. అప్పుడు కోహ్లీ అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు చేసి సంచలనాలు సృష్టించాడు.
కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు. 2020 తర్వాత టెస్టులలో కోహ్లీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. మూడేండ్లు ఫామ్ లేమితో తంటాలు పడ్డ కోహ్లీ... ఈ మూడేండ్ల కాలంలో 25 మ్యాచ్‌లు ఆడి 1,277 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో సగటు 29,69 గా ఉండగా ఒక్కటంటే ఒక్కటే సెంచరీ నమోదైంది. అది కూడా ఈ ఏడాది అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో టెస్టులో.. ఓవరాల్‌గా కోహ్లీ ప్రదర్శన టెస్టులలో నానాటికీ తగ్గుతూ వస్తోంది. ఈ ఫార్మాట్‌లో అతడు ఇంకెంతమాత్రమూ ప్రమాదకర బ్యాటర్ అయితే కాదు..’ అని వ్యాఖ్యానించాడు.
2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా టెస్టులలోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఇంతవరకూ 109 టెస్టులు ఆడి 8,479 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం వరకూ కోహ్లీ సగటు 50 కి పైనే ఉండేది. కానీ ఫామ్ కోల్పోవడంతో సగటు 48.72కు పడిపోయింది. టెస్టులలో కోహ్లీకి 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదే క్రమంలో గడిచిన మూడేండ్లలో జో రూట్ టెస్టు క్రికెట్ లో పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాడు. స్మిత్ తన నిలకడను కొనసాగిస్తుండగా మధ్యలో కొంత తడబడినా కేన్ మామ కూడా సెట్ అయ్యాడు. ఎటొచ్చి ఈ నలుగురిలో టెస్టులలో అత్యంత చెత్తగా ఆడుతున్న ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం. టెస్టులలో యువ రక్తాన్ని ఎక్కించే పనిలో ఉన్న భారత జట్టు.. ఈనెల 12 నుంచి వెస్టిండీస్ వేదికగా జరుగబోయే రెండు టెస్టుల సిరీస్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్న నేపథ్యంలో కోహ్లీ ప్రదర్శన మీద కూడా సెలక్టర్లు ఓ కన్ను వేయనున్నారు.