IND W vs BAN W 1st T20: ఈ ఏడాది ఫిబ్రవరిలో  ముగిసిన మహిళల టీ20 వరల్డ్ కప్ తర్వాత కొద్దికాలం గ్యాప్ తీసుకున్న  హర్మన్‌ప్రీత్ కౌర్ సేన..  బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బోణీ కొట్టింది.  బంగ్లా పర్యటనలో  భాగంగా   షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం (ఢాకా) వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు.. ఏడు వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో అదరగొట్టిన  భారత జట్టు తర్వాత బ్యాటింగ్‌లో కూడా రాణించింది.  బంగ్లాదేశ్ నిర్దేశించిన  115 పరుగుల లక్ష్యాన్ని  16.2 ఓవర్లలోనే ఛేదించింది.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)     హాఫ్ సెంచరీతో మెరిసింది. 


బంగ్లాను కట్టడిచేసిన బౌలర్లు.. 


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత   బౌలింగ్ ఎంచుకుంది.  కెప్టెన్ నమ్మకాన్ని  భారత బౌలర్లు నిలబెట్టారు.  బంగ్లా జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 114 పరుగులకే పరిమితం చేశారు. ఆ జట్టులో  శ్రోమా అక్తర్ (28 బంతుల్లో 28, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.  శతి రాణి (22), సోభన  మోస్తరి (23) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో  పూజా వస్త్రకార్.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ మెయిడిన్ చేయడమే గాక 16 పరుగులు మాత్రమే ఇచ్చింది.  ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన   కేరళ అమ్మాయి  మిన్ను మణి.. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఒక వికెట్ తీసింది.  షఫాలీ వర్మకు ఒక వికెట్ దక్కింది.  ఇదే మ్యాచ్ ద్వారా  ఎంట్రీ ఇచ్చిన ఆంధ్రా అమ్మాయి బారెడ్డి అనూష.. 4 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చింది. కానీ వికెట్ తీయలేకపోయింది. 


 






మంధాన, కౌర్ అలవోకగా.. 


స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు   తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ.. పరుగులేమీ చేయకుండానే అక్తర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. వన్ డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్  (11) కూడా విఫలమైంది.  కానీ  స్మ‌తి మంధాన  (34 బంతుల్లో 38, 5 ఫోర్లు) తో కలసి హర్మన్‌ప్రీత్ భారత స్కోరుబోర్డును పరుగెత్తించింది.  ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు  10 ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు.  విజయానికి 27 పరుగుల దూరంలో మంధాన నిష్క్రమించినా  కౌర్ మాత్రం బంగ్లాకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.  యస్తికా భాటియా (12 బంతుల్లో 9 నాటౌట్, 1 ఫోర్) తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. 115 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 16.2 ఓవర్లలో మూడు  వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హాఫ్ సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  దీంతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.  ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో ఈనెల 11న జరుగనుంది. 













Join Us on Telegram: https://t.me/abpdesamofficial