Sourav Ganguly Masterclass App: ఒక మూసలో పడిపోయిన భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చిన నాయకుడు  సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ అభిమానులు ‘దాదా’ అని పిలుచుకునే గంగూలీ..  ఈ ఆటలో దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగాడు. ఆటలో నాయకుడిగానే గాక ప్రపంచ క్రికెట్ పెద్దన్న బీసీసీఐని కూడా రెండేండ్ల పాటు విజయవంతంగా నడిపించిన బెంగాల్ టైగర్..  తన అనుభవాలను  నేటి తరంతో పంచుకోనున్నాడు. నాయకుడిగా ఎదగడానికి  ఉండాల్సిన లక్షణాలు,  చేయాల్సిన కృషి,   ఆచరించాల్సిన మార్గాలను యువకులకు బోధించనున్నాడు.  ఈ మేరకు  దాదా తన పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. 


నాయకత్వ లక్షణాలను బోధించేందుకు గాను  గంగూలీ ఒక ఆన్‌లైన్ లీడర్‌షిప్ కోర్సును ప్రారంభించాడు. ‘మాస్టర్ క్లాస్’ అనే యాప్ ద్వారా ఈ పాఠాలను, తన అనుభవసారాన్ని కాబోయే నాయకులతో పంచుకోనున్నాడు. ఇదే విషయాన్ని గంగూలీ తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘సుమారు 16 ఏళ్ల  అంతర్జాతీయ క్రికెట్, వందలాది మ్యాచ్‌లు  ఆడిన అనుభవంతో  నా 51వ పుట్టినరోజు సందర్భంగా నేను ఇన్నాళ్లు నేర్చుకున్న అంశాలను  మీ ముందుకు తీసుకొస్తున్నా. నా ఫస్ట్ ఆన్ లైన్ లీడర్‌షిప్   కోర్సు  సౌరవ్ గంగూలీ మాస్టర్ క్లాస్ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నా. చాలా తక్కువ సమయమే ఇచ్చినా  దీనికోసం  నిత్యం  కృషి చేసిన  క్లాస్ ప్లస్‌కు ధన్యవాదాలు.  మీరు ఎప్పటికీ నాకు కుటుంబంతో సమానం.  నేను, క్లాస్ ప్లస్ కలిసి ఈ యాప్ ద్వారా వచ్చిన నిధులను నిరుపేద పిల్లల చదువు కోసం వెచ్చిస్తాం..’ అని రాసుకొచ్చాడు. 


 






ఇంగ్లీష్, బెంగాలీలలో   దాదా ఈ క్లాస్ లను అందించనున్నాడు. ఈ యాప్ లో  దాదా చెప్పిన పాఠాలను వినడానికి  నెలకు  రూ. 499 చెల్లించాలి.  ఈ మేరకు మాస్టర్ క్లాస్ యూట్యూబ్ ఛానెల్ లో  గంగూలీ ఓ ప్రోమోను కూడా విడుదల చేశాడు.  


 






ఈ ప్రకటన చేయడానికంటే ముందు దాదా తన ట్విటర్ ఖాతాలో  మూడు రోజుల ముందునుంచే ‘మీకో సర్‌ప్రైజ్ ఉంది’ అంటూ చేసిన ట్వీట్ ద్వారా  ఆసక్తిని రేకెత్తించాడు. దీంతో దాదా ఏం చెప్పబోతున్నాడోనని  అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.  నిన్న  51వ పుట్టినరోజు జరుపుకున్న గంగూలీ.. తన మాస్టర్ క్లాస్ యాప్ గురించి  ప్రకటన చేశాడు.  

















Join Us on Telegram: https://t.me/abpdesamofficial