IND vs PAK: ప్రపంచ క్రికెట్‌లో అధిక వైరం ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ఉన్నా అందుకు ఎంతమాత్రమూ తీసిపోని.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకింత ఎక్కువే ఉండే పోరు ఇండియా - పాకిస్తాన్ ది అని తెలిసిందే. ఇంగ్లాండ్ - ఆసీస్‌లది ‘బూడిద’ పోరు అయితే దాయాదులది ‘సరిహద్దు’ పోరు. భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే రెండు దేశాల్లోని సుమారు 165 కోట్ల మంది కళ్లన్నీ ఆ ఫలితం మీదే ఉంటాయి. అయితే సరిహద్దు వివాదాల కారణంగా ఈ రెండు దేశాల మధ్య గడిచిన దశాబ్దం కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగడం లేదు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ దీని ప్రస్తావననే తెస్తూ.. పాక్‌కు రావాలంటే టీమిండియాకు భయమని సంచలన ఆరోపణలు చేశాడు.
స్థానికంగా ఉన్న ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ.. ‘మా ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పర గౌరవం, స్నేహభావంతో ఉంటాం. 1997- 98ల మధ్య భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు రావడానికి అంతగా ఆసక్తి చూపేది కాదు. ఎందుకంటే అప్పుడు మేం (పాకిస్తాన్) బలమైన జట్టుగా ఉన్నాం. మాతో ఆడిన మ్యాచ్‌లలో భారత్ ఎక్కువగా ఓడిపోయేది..’అని చెప్పాడు..
అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నా రజాక్.. ఈ రోజుల్లో ఏ టీమ్ కూడా ఫేవరేట్ అని చెప్పడం కష్టమని, తమదైన రోజున అనామక జట్లు కూడా బలమైన టీమ్స్‌ను బోల్తా కొట్టిస్తున్నాయని అన్నాడు. మెరుగైన ప్రదర్శన చేసినవారే విజేతలుగా నిలుస్తారని చెప్పాడు.
‘గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు బాగా మారాయి. ఇండియా - పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి పాకిస్తాన్ టీమ్ వీక్‌గా ఉందని చెప్పలేం. యాషెస్ సిరీస్‌నే తీసుకోండి.. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య బెస్ట్ టీమ్ ఏదంటే ఏం చెబుతాం..? మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన టీమ్ విజేతగా నిలుస్తుంది. భారత్ - పాక్ కూడా ఏ టీమ్ బలమైనది..? ఏది కాదు..? అని చెప్పడం కుదరదు. ఇరు జట్లూ విరివిగా మ్యాచ్‌లు ఆడాలి..’ అని అన్నాడు.
1999లో పాకిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన తర్వాత 2004 వరకూ ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగలేదు. 2004 నుంచి 2007 మధ్య ఇరు జట్లూ రెండు సార్లు రెండు ఫార్మాట్స్ సిరీస్‌లలో తలపడ్డాయి. 2007 తర్వాత భారత్ - పాక్ మధ్య ఒకే ద్వైపాక్షి సిరీస్ జరిగింది. 2012 - 13లో భారత్ - పాక్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్లూ ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. భారత్ విషయానికొస్తే.. 2008లో ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ కు వెళ్లిన టీమిండియా ఆ తర్వాత పాక్ పర్యటనకు వెళ్లలేదు. 2007 నుంచి ఇరు జట్లూ ఒక్క టెస్టు కూడా ఆడకపోవడం గమనార్హం. పాకిస్తాన్ చివరిసారి 2016 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఇరు జట్లూ ఐసీసీ టోర్నీలలో తటస్థ వేదికలమీదే ఆడుతున్నాయి. అన్నీ కుదిరితే ఇండియా - పాక్ మధ్య ఈ ఏడాది అక్టోబర్ 15న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదకగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది.