Ashes Series 2023: గతేడాది ఇంగ్లాండ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్‌తో అబ్బురపరుస్తున్న    యువ సంచలనం హ్యారీ బ్రూక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టులలో  అత్యంత వేగంగా వెయ్యి  పరుగులు పూర్తి చేసిన  బ్యాటర్లలో  అగ్రస్థానంలో నిలిచాడు.  లీడ్స్  వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్  ఆడి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన  బ్రూక్.. పలు రికార్డులను అందుకున్నాడు. 


బాల్స్ పరంగా ఫస్ట్ ప్లేస్..


టెస్టు క్రికెట్‌‌లో అటాకింగ్ అప్రోచ్‌తో  దూసుకుపోతున్న బ్రూక్.. బంతులపరంగా వేగంగా  వెయ్యి పరుగులు చేసిన  బ్యాటర్ల జాబితాలో తొలి  స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.  వెయ్యి పరుగులు చేయడానికి   బ్రూక్.. 1,058 బంతులలోనే పూర్తిచేశాడు.  ఈ రికార్డు గతంలో న్యూజిలాండ్ ఆటగాడు  కొలిన్ డి గ్రాండ్‌హోమ్  పేరిట ఉండేది. కొలిన్.. 1,140 బంతుల్లో  వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.   కివీస్ బౌలర్ టిమ్ సౌథీ  1,167 బంతులు,  ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 1,168 బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశారు. ఈ ముగ్గురి రికార్డులను  బ్రూక్   బ్రేక్ చేశాడు. 


 






ఇన్నింగ్స్ పరంగా..  


ఎదుర్కున్న బంతులుగా కాకుండా ఇన్నింగ్స్ పరంగా వెయ్యి పరుగుల చేసిన బ్యాటర్లలో చూస్తే  బ్రూక్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.  బ్రూక్‌కు ఇది  పదో టెస్టు కాగా లీడ్స్‌లో ఆడిన రెండో ఇన్నింగ్స్ 17వది.  ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిప్.. 12 ఇన్నింగ్స్‌లలోనే  వెయ్యి  పరుగులు పూర్తి చేశాడు.  వెస్టిండీస్ మాజీ క్రికెటర్  ఎవర్టన్ వీక్స్ 12 ఇన్నింగ్స్‌లో కూడా  సచ్లిప్‌తో సంయుక్తంగా నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (13 ఇన్నింగ్స్‌), భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (14 ఇన్నింగ్స్) మూడో  స్థానంలో ఉన్నాడు. లెన్ హటన్, వోరెల్ (16 ఇన్నింగ్స్) లు నాలుగో స్థానంలో ఉన్నారు. 


 






లీడ్స్‌లో సూపర్ ఇన్నింగ్స్.. 


యాషెస్ సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో  తన మార్కు  చూపించలేకపోయిన బ్రూక్.. లీడ్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం   ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. స్టార్క్, కమిన్స్, బొలాండ్ త్రయాన్ని తట్టుకుని  కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  ఈ ఇన్నింగ్స్‌లో 93 బంతులే ఆడిన బ్రూక్.. 9 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. బ్రూక్ పోరాటంతో ఇంగ్లాండ్.. లీడ్స్‌లో ఉత్కంఠ విజయాన్ని అందుకుని  యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టింది.  ఈ   మ్యాచ్‌లో ఫలితం తేడా కొడితే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడేది. ఇక ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 19 నుంచి  మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది. 


















Join Us on Telegram: https://t.me/abpdesamofficial