MS Dhoni on Chahar: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పేసర్ దీపక్ చాహర్‌కు ప్రత్యేక అనుబంధముంది.  ధోనీని సొంత అన్నలా భావించే చాహర్.. సీఎస్‌కేలో నమ్మదగ్గ పేసర్. తాజాగా ధోని.. చాహర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాహర్ ఒక  డ్రగ్ వంటివాడని.. తన జీవితంలో అతడు పరిణితి సాధించడం తాను చూడలేనని వ్యాఖ్యానించాడు. ఎల్‌జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్)  సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ సందర్భంగా చెన్నైకి వచ్చిన ధోని.. ఈ కార్యక్రమంలోనే చాహర్ గురించి కామెంట్స్ చేశాడు. 


ధోని మాట్లాడుతూ.. ‘దీపక్ చాహర్ ఒక డ్రగ్ లాంటోడు. అతడు మన దగ్గర లేకున్నా మనం అతడి గురించే ఆలోచిస్తాం. ఒకవేళ మనతోనే ఉంటే  ఎందుకు ఇక్కడ ఉన్నాడ్రా బాబు అనుకుంటాం. మంచి విషయం ఏంటంటే.. చాహర్ ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నాడు. కానీ దానికి చాలా టైమ్ పడుతుంది.  అదే  అతడికున్న ప్రధాన సమస్య.  నా జీవితం మొత్తంలో కూడా అతడి పరిపూర్ణమైన పరిణితి సాధించిన వ్యక్తిగా చూడలేను..’అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. 


ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అతడి భార్య నిర్మాతగా ఎల్‌జీఎం  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా (లవ్ టుడే ఫేమ్), యోగి బాబు, మిర్చి విజయ్, నదియాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమేశ్ తమిళ్‌మణి ఈ సినిమాకు దర్శకుడు. 


 






తనకు చెన్నైతో ప్రత్యేక అనుబంధముందన్న ధోని.. ఇక్కడి ప్రజలతో తమకు ఉన్న అనుబంధం మేరకు తొలి సినిమాను కూడా ఇక్కడే తీస్తున్నామని చెప్పాడు. ‘నాకు చెన్నైతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.  నా ఫస్ట్ టెస్టు ఇక్కడే ఆడాను. టెస్టులలో నా హయ్యస్ట్ స్కోరు కూడా ఇక్కడే.  ఇప్పుడు నా ఫస్ట్ మూవీ కూడా ఇక్కడే నిర్మిస్తున్నా.  ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పుడు చెన్నై నన్ను అక్కున చేర్చుకుంది..’అని చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పాడు.


ఇక ఎల్‌జీఎం సినిమా గురించి ధోని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను మేం చాలా రికార్డు టైమ్‌లో పూర్తి చేశాం. నా కూతురుతో కలిసి కూడా ఈ సినిమాను చూడొచ్చు. సినిమా చూసేప్పుడు నా కూతురు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతోందనుకోండి. అది వేరు విషయం.  తాను చాలా ఎంజాయ్ చేసింది. ఈ సినిమా ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకోవడానికి  తన ప్రేమికురాలు, తల్లితో  ఎదురయ్యే సమస్యల గురించి ఉంటుంది. మీకందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశాను.  ఈ కార్యక్రమంలో  నదియా తన కళ్లతోనే మాట్లాడింది. హరీష్ చాలా మాట్లాడాడు. కానీ సినిమాలో అతడికి పెద్దగా డైలాగ్స్ ఉండవు.  నదియా, ఇవానా అతడిని మాట్లాడనివ్వరు..’అంటూ ఫంక్షన్‌కు వచ్చినవారికి నవ్వులు పూయించాడు. 


యోగిబాబుకు వెల్కమ్.. 


ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఈ సందర్భంగా ధోని అతడి గురించి మాట్లాడుతూ.. ‘చెన్నై టీమ్‌లో రాయుడు రిటైర్ అయ్యాడు. మాకు సీఎస్కేలో రాయుడు స్థానం ఖాళీగా ఉంది.  నేను టీమ్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. కానీ మీరేమో (యోగిబాబు) సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మా టీమ్ తరఫున ఆడితే మీరు నిలకడగా ఆడాలి. మీకు ఇంకో విషయం చెబుతున్నా. అసలే మావోళ్లు ఫుల్ స్పీడ్‌తో బాల్స్ వేస్తారు. మిమ్మల్ని గాయపరచడానికి కూడా వాళ్లు  ప్రయత్నిస్తారు..’ అని  అనడంతో అక్కడున్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు. 




















Join Us on Telegram: https://t.me/abpdesamofficial