IND vs ZIM, Match Highlights: జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ ఊపేసిన ఈ మ్యాచ్ లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. గిల్ సూపర్ సెంచరీతో పాటు ఇషాన్ కిషన్ అర్ధశతకంతో రాణించారు. 


రజా సెంచరీ వృథా
290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఓపెనర్ కైయా వికెట్ ను త్వరగానే కోల్పోయింది. డీఆర్ ఎస్ ద్వారా భారత్ ఈ వికెట్ సాధించింది. మరో ఓపెనర్ కైతానో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే వన్ డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ దూకుడుగా ఆడాడు. దీంతో పరుగులు బాగానే వచ్చాయి. ధాటిగా ఆడుతున్న విలియమ్స్ ను 45 పరుగుల వద్ద అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. టోనీని అవేశ్ ఖాన్, కెప్టెన్ చకాబ్వాను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించారు. తిరిగొచ్చి ఆడిన కైతాను కుల్దీప్ ఔట్ చేశాడు. ఈ దశలో సికిందర్ రజా సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. బ్రాడ్ ఇవాన్స్ సాయంతో శతకం సాధించాడు.


ఇన్నింగ్స్ 49వ ఓవర్లో శార్దూల్ బౌలింగ్ లో ఔటై నిరాశగా వెనుదిరిగాడు సికిందర్‌ రజా. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా..అవేశ్ ఖాన్ బౌలింగ్ లో విక్టర్ బౌల్డ్ అవటంతో జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో చాహర్, అవేశ్ ఖాన్, కుల్దీప్, అక్షర్ తలా రెండు వికెట్లు తీశారు.


శతకంతో చెలరేగిన గిల్ 
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో రాహుల్.. బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత శిఖర్ కు గిల్ జతకలిశాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 84 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ స్కోరు బోర్డును నడిపించాడు.
 తొలుత ఆచితూచి ఆడిన ఈ జంట.. వీలు చిక్కినప్పుడిల్లా బౌండరీలు బాదారు. 35వ ఓవర్లో గిల్ తన అర్ధశతకాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా ఒక పరుగుకే ఔటయ్యాడు.


ఒకవైపు వికెట్లు పడుతున్నా గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. హుడా తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ వరుసగా రెండు సిక్సులు కొట్టి పెవిలియన్ చేరాడు. శతకం తర్వాత జోరు పెంచిన గిల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్కోరు పెంచే క్రమంలో 49వ ఓవర్లో 130 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి  భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు సాధించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ పడగొట్టారు.