IND vs WI: భారత్ - వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు ప్రతిఘటిస్తోంది. తొలి టెస్టులో విఫలమైన విండీస్ బ్యాటర్లు రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తున్నారు. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. భారీగా పరుగులు సాధించకున్నా క్రీజులో పాతుకుపోయేందుకు యత్నించారు. తొలి టెస్టులో తమను దెబ్బకొట్టిన అశ్విన్‌తో పాటు జడేజాను కూడా సమర్థవంతంగా అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ పోరాటంతో రెండో టెస్టులో మూడో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్.. 108 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
వర్షం అడ్డంకి..
ఓవర్ నైట్ స్కోరు 86-1 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన విండీస్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ( 225 బంతుల్లో 75, 2 ఫోర్లు, 1 సిక్స్), కిర్క్ మెకెంజీ (57 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్స్) లు నడిపించారు. ఈ ఇద్దరూ 10.4 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు. తొలి టెస్టు ఆడుతున్న ముఖేష్ కుమార్ వేసిన 51వ ఓవర్ నాలుగో బంతికి మెకంజీ కిషన్‌కు క్యాచ్ ఇఛ్చాడు. ఆ తర్వాత వర్షం ఆరంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తొలి సెషన్‌లో వర్షం వల్ల ఆట సాగలేదు.
లంచ్ తర్వాత తిరిగి ఆట ప్రారంభమైంది. రెండో సెషన్‌లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న బ్రాత్‌వైట్.. క్రీజులో కుదురుకుపోయాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న అతడిని ఎట్టకేలకు అశ్విన్.. 72వ ఓవర్లో నాలుగో బంతికి బౌల్డ్ చేశాడు. అతడి స్థానంలో వచ్చిన జెర్మైన్ బ్లాక్‌వుడ్ కూడా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 92 బంతులాడి 20 పరుగులే చేయగలిగాడు. కానీ అతడిని రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక చివరి సెషనల్‌లో వికెట్ కీపర్ జోషువా డి సిల్వ (26 బంతుల్లో 10)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిర్ణీత సమయానికంటే ముందుగానే నిలిపేశారు.
ప్రస్తుతం అలిక్ అథనేజ్ (111 బంతుల్లో 37 నాటౌట్, 3 ఫోర్లు), జేసన్ హోల్డర్ (39 బంతుల్లో 11 నాటౌట్, 1 ఫోర్) లు క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ భారత్ ఈ టెస్టులో ఆధిక్యంలోనే కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లు రోజంతా శ్రమించినా నాలుగు వికెట్లే తీయగలిగారు. జడ్డూకు రెండు వికెట్లు దక్కగా ముఖేష్, అశ్విన్‌లు తలా ఓ వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 128 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (121) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ (80), రవీంద్ర జడేజా (61), యశస్వి జైస్వాల్ (57)లు రాణించారు. కాగా ఈ టెస్టులో మరో రెండు రోజుల ఆటనే మిగిలిఉండటం.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం.. ఇంకా ఇరు జట్లవి ఒక్క ఇన్నింగ్స్ కూడా ముగియకపోవడంతో ఈ టెస్టు డ్రా దిశగా సాగుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial