Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిఉన్న  కోహ్లీకి మరో  డైహార్డ్ ఫ్యాన్ వచ్చారు.  వెస్టిండీస్ వికెట్ కీపర్ జోషువా డి సిల్వ  తల్లి.. భారత్ - వెస్టిండీస్ మధ్య  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా   కింగ్ కోహ్లీని కలుసుకుంది. కోహ్లీని చూడగానే ఆమె  ఆనందంతో  అతడిని మనసారా హత్తుకుని భావోద్వేగానికి గురైంది. తన కొడుకు టెస్టు ఆడుతున్నా.. తాను మాత్రం  విరాట్ ఆట చూసేందుకే వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. 


ఆట రెండో రోజు క్వీన్స్  పార్క్ ఓవల్ వద్దకు  భారత ఆటగాళ్లు బస్సులో చేరుకుని  స్టేడియం వైపుగా వెళ్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ.. అక్కడే ఉన్న జోషువా డి సిల్వ  తల్లిని కలిశాడు. ఆమె  విరాట్‌ను  చూడగానే పట్టరాని ఆనందంతో  అతడిని హగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  విరాట్‌ను కలిసిన తర్వాత ఆమె స్పందిస్తూ.. ‘నేను నా జీవితంలో ఫస్ట్ టైమ్ విరాట్‌ను కలిశాను.  అతడు చాలా టాలెంటెడ్ క్రికెటర్. విరాట్‌లా నా కొడుకు కూడా అద్భుతంగా ఆడాని కోరుకుంటున్నా..’అని  చెప్పింది. కోహ్లీ కూడా ఆమెను ఆప్యాయంగా పలకరించాడు.


 






రెండో టెస్టు తొలి రోజు కోహ్లీ బ్యాటింగ్‌‌కు వచ్చినప్పుడు  వికెట్ల వెనుక జోషువా  కోహ్లీతో.. ‘మా అమ్మ నాకు ఫోన్ చేసి  నేను విరాట్‌ను చూసేందుకు వస్తున్నాను అని చెప్పింది.  ఆ మాట విన్న నేను ఆశ్చర్యానికి గురయ్యాను.  మా అమ్మ నా ఆటను చూడటానికి కాకుండా విరాట్ కోసం రావడమేంటని  నేను బాధపడలేదు. ఎందుకంటే ఆమె  కోహ్లీకి వీరాభిమాని..’అని  అన్నాడు. స్టంప్స్‌లో ఇది రికార్డైంది.


కాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా  కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.  తన కెరీర్‌లో 500వ  మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. సెంచరీ చేయడంతో  పలు రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్‌కు టెస్టులలో ఇది 29వ సెంచరీ, మొత్తంగా 76వది కావడం గమనార్హం.  భారత్ వెలుపల కోహ్లీకి ఇది  2018 తర్వాత తొలి సెంచరీ.  టెస్టులలో 29వ సెంచరీ చేయడం ద్వారా అతడు..  ఆస్ట్రేలియా దిగ్గజం  డాన్ బ్రాడ్‌మన్  సెంచరీల రికార్డు (29)ను సమం చేశాడు. 


విరాట్‌తో పాటు రవీంద్ర జడేజా (61), రోహిత్ శర్మ (80), యశస్వి జైస్వాల్ (57), రవిచంద్రన్ అశ్విన్ (56) లు రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లకు 428 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్.. 41 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (37 నాటౌట్), మెకంజీ (14 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఇంకా 352 పరుగులు వెనుకబడి ఉంది. 




















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial