Asia Emerging Cup Semi-Final: కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియా ఎమర్జింగ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది.  మూడు రోజుల క్రితమే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్.. నిన్న  ప్రేమదాస స్టేడియం (కొలంబో) వేదికగా  ముగిసిన రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను  ఓడించి  ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్‌లో విఫలమైనా భారత స్పిన్నర్లు రాణించడంతో  బంగ్లాకు షాక్ తప్పలేదు. ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఆదివారం పాకిస్తాన్‌తో జరుగబోయే  ఫైనల్‌లో  అమీతుమీ తేల్చుకోనుంది. 


బ్యాటింగ్ వైఫల్యం.. 


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్..  బంగ్లా బౌలర్ల ధాటికి తడబడింది. కెప్టెన్ యశ్ ధుల్ (85 బంతుల్లో 66, 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు.  పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం సాధించిన  ఓపెనర్ సాయి సుదర్శన్ (21) తో పాటు అదే మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసిన నికిన్ జోస్ (17) కూడా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (34) ఫర్వాలేదనిపించినా   ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు.  


బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ  భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.  రియాన్ పరాగ్ (12), ధ్రువ్ జురెల్ (1), హర్షిత్ రాణా (9) లు కూడా విఫలయమ్యారు. ఆఖర్లో రాజవర్ధన్ హంగర్గేకర్ (21) పుణ్యమా అని భారత  స్కోరు  రెండు వందల మార్కు దాటింది. 49.1 ఓవర్లలో భారత్.. 211 పరుగులకే ఆలౌట్ అయింది. 


 






స్పిన్నర్లు కేక.. 


స్వల్ప లక్ష్య ఛేదనలో  బంగ్లాదేశ్‌కు శుభారంభమే దక్కింది.  ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (38),  తాంజిద్ హసన్  (51) లు తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు.  లక్ష్య ఛేదనలో ఆ జట్టు.. 20 ఓవర్ల వరకూ బాగానే ఆడింది.   భారత్‌కు భంగపాటు తప్పదనుకున్నారంతా.. కానీ భారత స్పిన్నర్లు మాయ చేశారు.   నిషాంత్ సింధు..  తాంజిద్ హసన్‌తో పాటు  మహ్మదుల్ హసన్ జాయ్ (20), అక్బర్ అలీ (2), మెహది హసన్ (12)లను ఔట్ చేసి బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు.  అతడికి తోడుగా  మానవ్ సుతార్ కూడా జకీర్ హసన్ (5), ఓపెనర్ నయీమ్‌లను పెవిలియన్‌కు పంపడంతో బంగ్లా కోలుకోలేదు.  18 ఓవర్లకు ముందు 100-2గా ఉన్న ఆ జట్టు.. మరో  15 ఓవర్లలో  60  పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్ల ధాటికి బంగ్లా నిలువలేకపోయింది. బంగ్లా 160‌ పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 51 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 


 






మరో సెమీస్‌లో పాకిస్తాన్.. శ్రీలంకపై 60 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం  పాకిస్తాన్ - భారత్ మధ్య  కొలంబో వేదికగా ఫైనల్ జరుగనుంది.




















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial