IND vs WI T20:


వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ నుంచి ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించలేదని సమాచారం. హ్యామ్‌ స్ట్రింగ్‌ ఇంజూరీ కావడంతో అతడికి విశ్రాంతినిచ్చారని తెలిసింది. ఫిట్‌నెస్‌ సాధించగానే అతడు జట్టులోకి తిరిగొస్తాడని బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు తెలిపాయి. అలాగే చెతేశ్వర్‌ పుజారా సైతం పునరాగమనం చేస్తాడని, టీ20 సెన్సేషన్‌ రింకూ సింగ్‌ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం ఖాయమేనని సమాచారం.


'ఉమేశ్‌ యాదవ్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజూరీతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉమేశ్‌ యాదవ్‌ వయసు 35 ఏళ్లు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 0-77, 2-45తో మోస్తరు ప్రదర్శనే చేయడంతో అతడిపై వేటు పడిందని వదంతులు వ్యాపించాయి. 57 టెస్టుల్లో 170 వికెట్లు పడగొట్టిన యాదవ్‌, పరుగుల వరద పారించిన చెతేశ్వర్‌ పుజారాకు సెలక్టర్లు తలుపులు మూసేయలేదని బోర్డు వర్గాలు అంటున్నాయి.


'ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌కు ముందు 15 నెలలు అజింక్య రహానె జట్టుకు దూరమయ్యాడు. పునరాగమనం తర్వాత సత్తా చాటిన అతడిని వెస్టిండీస్‌ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ప్రకటించారు. అలాగే ఏ సీనియర్‌ ఆటగాడికీ తలుపులు మూసేయలేదు. అయితే ఏదో ఒక దశలో జట్టులో పరివర్తన మొదలుపెట్టాల్సిందే. సీనియర్లంతా ఒకేసారి జట్టును వదిలేసే పరిస్థితిని సెలక్టర్లు కోరుకోవడం లేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎప్పుడూ సీనియర్లు, యువకులతో కళకళలాడాలి' అని బీసీసీఐ అధికారి అన్నారు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో మెరుపులు మెరిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రింకూ సింగ్‌ టీమ్‌ఇండియాలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో అతడు 14 మ్యాచుల్లోనే 59.25 సగటు, 149.52 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశవాళీ క్రికెట్లోనూ మంచి ప్రతిభ కనబరిచాడు. అందుకే వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసుకు అతడు ఎంపికవ్వడం గ్యారంటీ అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. టెస్టు, వన్డే సిరీసులకు విశ్రాంతినిచ్చిన మహ్మద్‌ షమీ టీ20 సిరీసుకూ అందుబాటులో ఉండడని తెలిసింది.






భారత టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ (కె), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, కేఎస్ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌, నవదీప్‌ సైనీ


భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ (వి), ఇషాన్‌ కిషన్‌ (వి), హార్దిక్‌ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial