IND vs WI:
టీమ్‌ఇండియాతో రెండు టెస్టుల సిరీస్‌కు క్రికెట్ వెస్టిండీస్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఎప్పట్లాగే క్రెయిగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు కరీబియన్ స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉండటం సందిగ్ధంగా మారింది.
ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. హరారేలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీ ఆడుతోంది. దాంతో జులై 9 వరకు అక్కడే ఉండాల్సి వస్తోంది. జులై 7న చివరి సూపర్ 6 మ్యాచ్ ఆడుతుంది. పాయింట్లను బట్టి జులై 9న ఫైనల్‌కు చేరుకోవచ్చు. అప్పటి వరకు కరీబియన్ దీవులకు వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ ఫైనల్ ఆడకపోతే ముందుగా రావొచ్చు.
భారత్, వెస్టిండీస్ సుదీర్ఘ ఫార్మాట్ జులై 12న మొదలవుతుంది. డొమినికా ఇందుకు వేదిక. జులై 20న ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు ఆరంభమవుతుంది. అయితే క్రికెట్ వెస్టిండీస్ ఏర్పాటు చేసిన సన్నాహక జట్టు జులై 8 వరకు ఆంటిగ్వాలోనే ఉంటుంది. అక్కడే సాధన చేస్తుంది. టెస్టు సిరీసుతో పోలిస్తే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే విండీస్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్ వంటి స్టార్లు అక్కడే ఉన్నారు. వారిలో కొందరు నేరుగా తొలి టెస్టు రావొచ్చని సమాచారం.
హరారే నుంచి డొమినికాకు విమానాలు ఎక్కువగా అందుబాటులో లేవు. దాంతో అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు తొలి టెస్టుకు వస్తారో లేదోనన్న సందేహం నెలకొంది. ఒకవేళ వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ అర్హత పోటీ ఫైనల్‌కు ఎంపికైతే రెండో ప్రాధాన్య జట్టుతోనే టీమ్‌ఇండియా ఆడాల్సి వస్తుంది. కాగా విండీస్ ట్రైనింగ్ క్యాంప్ ఆంటిగ్వాలో శుక్రవారమే మొదలవుతుంది. జులై 9న జట్టు డొమినికాకు వెళ్తుంది. హోల్డర్ సహా మిగతా ఆటగాళ్లు నేరుగా అక్కడికే చేరుకోవచ్చు.
టీమ్‌ఇండియా వారం రోజుల క్రితమే టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఆటగాడు చెతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. అజింక్య రహానెకు వైస్ కెప్టెన్సీ దక్కింది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్ వంటి కుర్రాళ్లకు చోటు దక్కింది.
వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్‌క్రుమా బోనర్, టగెనరైన్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవమ్ హడ్జ్, అకీమ్ జోర్డాన్, జెయిర్ మెక్‌అలిస్టర్, కిర్క్ మెకెన్జీ, మార్కినో మిండ్లే, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్