IND vs PAK, ODI Worldcup 2023: 



టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీపై రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ఆడుతున్నప్పుడు అతడు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు అనిపించిందన్నాడు. ఆఖరి బంతిని ఆడేందుకు తనకు ఏడు ఆప్షన్లు ఇచ్చాడని వెల్లడించాడు. విరాట్‌ గురించి యాష్‌ మాట్లాడిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.


ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. అక్టోబర్‌-నవంబర్లో మొత్తం 46 రోజులు పాటు మ్యాచులు జరుగుతాయి. ఇందుకోసం  పది వేదికలను సిద్ధం చేశారు. మొత్తం 48 మ్యాచులు జరుగుతాయి. సాధారణంగా ఏడాది ముందే షెడ్యూలు విడుదల చేసే ఐసీసీ ఈసారి వంద రోజుల ముందు చేసింది. ఈ సందర్భంగా గత ప్రపంచకప్‌లు, అందులోని బెస్ట్‌ ఇన్నింగ్సులు, క్యాచులు, మూమెంట్స్‌, బౌలింగ్‌పై ఆటగాళ్లు, మాజీలతో మాట్లాడిస్తోంది.


వన్డే ప్రపంచకప్‌ ప్రచారంలో భాగంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ గురించి అశ్విన్‌తో ఐసీసీ మాట్లాడించింది. 'మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలోకి ప్రవేశించగానే ఉద్వేగం కట్టలు తెంచుకుంది. అభిమానులు ఊగిపోతున్నారు. పరిస్థితులు ఉద్విగ్నంగా మారిపోయాయి. అలాంటి వాతావరణాన్ని నేనప్పటి వరకు చూడలేదు. నేను విరాట్‌ కోహ్లీని చూడగానే అతడి కళ్లు ఇతర గ్రహం నుంచి వచ్చిన వ్యక్తిలా కనిపించాయి' అని యాష్‌ చెప్పాడు.


కఠినమైన మెల్‌బోర్న్‌ వికెట్‌పై పాకిస్థాన్ ఆ మ్యాచులో 159/8 స్కోర్‌ చేసింది. ఛేదనలో టీమ్‌ఇండియా 31 పరుగులే నాలుగు కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. కానీ విరాట్‌ కోహ్లీ వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పోరాడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా దినేశ్ కార్తీక్‌ పెవిలియన్ చేరాడు. దాంతో మిగిలిన ఒక బంతికే రెండు రన్స్‌ చేయాలి. అప్పుడు క్రీజులోకి వచ్చిన తనకు విరాట్‌ కోహ్లీ కొన్ని సలహాలు ఇచ్చాడని యాష్ పేర్కొన్నాడు.


'నేను క్రీజులోకి వచ్చిన వెంటనే ఆఖరి బంతిని ఆడేందుకు విరాట్‌ కోహ్లీ ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. ఆ మ్యాచ్ గెలిపించేందుకు అతడు టెరిఫిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు' అని అశ్విన్‌ ప్రశంసించాడు. ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ విరాట్‌ ఇలాంటి ప్రదర్శనే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్‌ 15, ఆదివారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో భారత్‌, పాక్‌ తలపడుతున్నాయి. ఈ స్టేడియంలో లక్షా పదివేల మంది ప్రత్యక్షంగా మ్యాచును వీక్షించగలరు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్‌ మొదలవుతుంది.


అక్టోబర్‌ 15న జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచుపై ఇంట్రెస్టు పెరుగుతోంది. నగరంలోని హోటళ్లలో అక్టోబర్‌ 13 నుంచి 16 మధ్య బుక్సింగ్‌ జరుగుతున్నాయి. మ్యాచులు జరిగే రోజుల్లో హోటల్‌ గదులన్నీ బుక్‌ అవుతాయని హోటల్‌ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.అంతర్జాతీయ క్రికెట్‌ బృందాలు, అభిమానుల, స్పాన్సర్ల నుంచి హోటల్‌ గదుల బుకింగ్‌పై ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వీవీఐపీఎలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని సమాచారం.