Ashes 2023: ఆస్ట్రేలియా మాజీ  సారథి స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై  తనకు  తిరుగులేదని   నిరూపిస్తున్నాడు.   వయసు పైబడుతున్నా తనలో   సత్తా తగ్గలేదని.. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ (భారత్‌తో)లో సెంచరీ చేసిన స్మిత్.. తాజాగా యాషెస్  సిరీస్‌లో భాగంగా   లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో కూడా  శతకంతో చెలరేగాడు. గడిచిన  20 రోజుల వ్యవధిలో  ఇంగ్లాండ్ గడ్డమీద   స్మిత్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.  


రికార్డులే రికార్డులు.. 


లార్డ్స్ టెస్టులో భాగంగా ఆట తొలిరోజు  అయిన నిన్న  వ్యక్తిగత స్కోరు  32 పరుగుల వద్ద  టెస్టులలో 9 వేల పరుగుల మైలురాయిని దాటిన స్మిత్  నేడు కూడా ఆ జోరును కొనసాగించాడు.   85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  రెండో రోజు ఆట ఆరంభించిన  స్మిత్..  గురువారం నాడు ఆటలో భాగంగా అండర్సన్ వేసిన  92 వ ఓవర్లో  నాలుగో బంతిని  బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టులలో స్మిత్‌కు ఇది  32వ సెంచరీ.  


ప్రస్తుతం 99వ టెస్టు ఆడుతున్న స్మిత్.. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా  32 టెస్టులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై అతడికి ఇది 12వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న  అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌తో మినహా మిగిలిన దేశాలన్నింటిపైనా  సుమారు 2 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేశాడు స్మిత్. 


ఫ్యాబ్-4 లో అతడే తోపు.. 


ఆధునిక క్రికెట్‌లో ఫ్యాబ్ - 4గా పిలుచుకునే నలుగురు బ్యాటర్ల (స్టీవ్ స్మిత్,  జో రూట్, కేన్ విలిమయ్సన్, విరాట్ కోహ్లీ) లో స్మిత్ టెస్టులలో అందరికంటే ఎక్కువ సెంచరీలు కలిగిఉన్నాడు.  ఆ జాబితాను  చూస్తే.. 


- స్మిత్  :  99 టెస్టులు 174 ఇన్నింగ్స్‌లలో 32 సెంచరీలు
- జో రూట్ : 132 టెస్టులు 240 ఇన్నింగ్స్ లలో 30 సెంచరీలు 
- కేన్ విలియమ్సన్ : 94 టెస్టులు 164 ఇన్నింగ్స్‌లలో 28  సెంచరీలు
- విరాట్ కోహ్లీ : 109 టెస్టులు 185 ఇన్నింగ్స్‌లలో 28  సెంచరీలు


 






యాక్టివ్ ప్లేయర్స్‌లో అత్యధిక  సెంచరీలు.. 


- విరాట్ కోహ్లీ  : 75 
- జో రూట్ : 46 
- డేవిడ్ వార్నర్ : 45 
- స్టీవ్ స్మిత్ : 44 
- రోహిత్ శర్మ : 43 


లార్డ్స్‌లో  పరుగుల వరద.. 


ఇంగ్లాండ్ - ఆసీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో  ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  తొలి ఇన్నింగ్స్‌లో  100.4 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ (110), ట్రావిస్ హెడ్ (77), డేవిడ్ వార్నర్ (66) రాణించారు. అనంతరం  బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ కూడా దూకుడు మంత్రాన్నే జపిస్తోంది. 33 ఓవర్లకే ఆ జట్టు ఒక వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది.  జాక్ క్రాలే (48)‌ను  లియాన్ ఔట్ చేశాడు. బెన్ డకెట్ (103 బంతుల్లో 70 నాటౌట్, 7 ఫోర్లు), ఓలీ పోప్ (47 బంతుల్లో 34 నాటౌట్, 4 ఫోర్లు) జోరుమీదున్నారు.