Ganguly on Rahane:
టీమ్‌ఇండియా సెలక్షన్ కమిటీ పనితీరు, ఆలోచన ప్రక్రియ అర్థం కావడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు. 18 నెలలు జట్టులో లేని క్రికెటర్‌కు ఒక్క మ్యాచ్ ఆడగానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్‌కు టెస్టుల్లో చోటు దక్కకపోవడం బాధాకరమని వెల్లడించాడు. భవిష్యత్తులో వీరు టీమ్‌ఇండియాకు ఆడతారని ధీమా వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీసుకు బీసీసీఐ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ కీలకంగా ఆడిన సీనియర్ ఆటగాడు చెతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు వేటు వేశారు. అజింక్య రహానెకు మళ్లీ వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్‌ను ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్‌ను వదిలేశారు. శుభ్‌మన్ గిల్ వంటి యువ క్రికెటర్లను నాయకులుగా రూపొందించేందుకు ఇదే సరైన సమయం కాదా? అని ప్రశ్నించగా సౌరవ్ గంగూలీ స్పందించాడు.
అజింక్య రహానెకు (Ajinkya Rahane) వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనకడుగు వేసినట్టేమీ కాదని దాదా అంటున్నాడు. అయితే అది తెలివైన నిర్ణయం కాదన్నాడు. 'ఇది వెనకడుగు వేసినట్టు కాదు! అతడు 18 నెలలు టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాలాకాలం తర్వాత ఒకే ఒక్క టెస్టు ఆడి వైస్ కెప్టెన్ అయ్యాడు. కాకపోతే దీని వెనకాల ఆలోచన ప్రక్రియ ఏంటో అర్థమవ్వడం లేదు. రవీంద్ర జడేజా సుదీర్ఘ కాలంగా నిలకడగా టెస్టులు ఆడుతున్నాడు. అతడు కచ్చితంగా నాయకత్వ బాధ్యతలకు అర్హుడే. అందుకే 18 నెలల తర్వాత ఒక టెస్టు ఆడగానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడమే నాకర్థమవ్వడం లేదు. సెలక్షన్ విధానంలో కొనసాగింపు, నిలకడ అవసరం' అని గంగూలీ వెల్లడించాడు.
నయావాల్ ఛెతేశ్వర్ పుజారాను తప్పించడంపై సౌరవ్ స్పందించాడు. 'పుజారా గురించి సెలక్టర్లకు స్పష్టమైన అవగాహన అవసరం. మళ్లీ అతడితో టెస్టు క్రికెట్ ఆడించాలని భావిస్తున్నారా? లేదంటే యువ క్రికెటర్లనే కొనసాగించాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవునైతే ఈ విషయాన్ని అతడికి స్పష్టం చేయండి. పుజారా లాంటి ఆటగాడిపై వేటు వేయొద్దు. ఆ తర్వాత మళ్లీ ఎంపిక చేయొద్దు. మళ్లీ తొలగించొద్దు. అజింక్య రహానె విషయంలోనూ ఇంతే' అని దాదా చెప్పాడు.
'రంజీ, ఇరానీ, దులీప్ ట్రోఫీల్లో యశస్వీ జైశ్వాల్ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. అందుకే అతడిని ఎంపిక చేశారు. కాకపోతే సర్ఫరాజ్ ఖాన్ గురించి బాధపడుతున్నా. మూడేళ్లుగా అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఏదో ఒక దశలో టెస్టు జట్టులో తీసుకోవాల్సింది. అభిమన్యు ఈశ్వరన్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఐదేళ్లుగా అతడు నిలకడగా పరుగులు చేస్తున్నాడు. వారిద్దరినీ ఎంపిక చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భవిష్యత్తులో వారికి చోటు దక్కుతుంది. యశస్వీ జైశ్వాల్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే' అని దాదా పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగును ఆడలేడన్న వాదనతో గంగూలీ ఏకీభవించలేదు. ఒకసారి ఆడిస్తేనే కదా తెలిసేదని పేర్కొన్నాడు.