Tilak Verma: విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా  టీ20 సిరీస్‌లో భాగంగా  అరంగేట్రం చేసిన ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ ఆడిన రెండో మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించాడు.  భారత జట్టు తరఫున టీ20లలో అత్యంత పిన్న వయసులో అర్థ సెంచరీ సాధించిన  ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే హాఫ్  సెంచరీ చేశాక తిలక్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు.   ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా అలా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాననేదానిపై తిలక్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 


తన తొలి అర్థ శతకాన్ని తిలక్.. రోహిత్ శర్మ కూతురు  సమైరాకు అంకితమిచ్చాడు.  మ్యాచ్ ముగిశాక కూడా అతడు ఇదే చెప్పాడు.  బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ మాట్లాడుతూ... ‘ఆ సెలబ్రేషన్స్ శామి  (రోహిత్ కూతురు సమైరా) కోసం.. నేనూ, శామి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను అంతర్జాతీయ  క్రికెట్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ, సెంచరీ చేసినా తనకే అంకితమిస్తానని నేను గతంలోనే తనకు ప్రామిస్ చేశా. అందుకే  ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేశాక అలా సెలబ్రేట్ చేసుకున్నా. వాస్తవానికి మేం ఇద్దరం అలాగే ఆడుకుంటాం..’అని  చెప్పాడు. 


ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండింటిలోనూ భారత్ ఓడినా  తిలక్ వర్మ మాత్రం ఆకట్టుకున్నాడు.  ఫస్ట్ మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో మ్యాచ్‌లో  41 బంతుల్లో 51 పరుగులు సాధించాడు.  నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. భారత బ్యాటర్లు పరుగులు తీయడానికి తంటాలుపడిన చోట అలవోకగా  పరుగులు సాధించాడు.  బెదురులేకుండా ఆడుతున్న తిలక్ పై  ప్రశంసలు కురుస్తున్నాయి. 


 






 






ఇక తన కెరీర్‌లో ఎదుగుదలకు  రోహిత్ శర్మ  పాత్ర కీలకమని, టీమిండియా సారథి తనను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నాడని  తెలిపాడు. ‘రోహిత్ భయ్యాతో నేను నిత్యం మాట్లాడుతూనే ఉంటా. అతడు నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటాడు..’ అని తెలిపాడు. 


 






ఐపీఎల్- 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చిన తిలక్..ఆ సీజన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అత్యద్భుతంగా రాణించాడు. ఆ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అతడే. ఇక ఈ ఏడాది కూడా తిలక్.. మరింత రాటుదేలాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలలో కూడా నిలకడగా రాణిస్తుండటంతో తిలక్‌కు భారత జట్టులో చోటు దక్కింది.

























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial