వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం జరుగుతోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.


భారత్ ఈ మ్యాచ్‌లో రెండు కీలక మార్పులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో డగౌట్‌కు పరిమితం కానున్నారు. వీరి స్థానంలో సంజు శామ్సన్, అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పటికే మొదటి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ కూడా టీమిండియా సొంతం కానుంది.


టాస్ సందర్భంగా భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘మేం కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ పిచ్‌పై ఎంత స్కోరు చేయగలమో చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. రోహిత్, విరాట్ చాలా నిలకడగా క్రికెట్ ఆడుతున్నారు. జట్టు పరంగా మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు వారికి విశ్రాంతిని ఇచ్చాం. మూడో వన్డేకు వారు చాలా ఫ్రెష్‌గా ఉంటారు. గత వన్డేలో మేం ఐదు వికెట్లు కోల్పోయాం. నిజానికి అది రెండు వికెట్లు కోల్పోయి ఛేదించాల్సిన లక్ష్యం.  రోహిత్, విరాట్ స్థానంలో సంజు శామ్సన్, అక్షర్ పటేల్ రానున్నారు.’ అన్నాడు. 


వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కేవలం 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (52: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. 


వెస్టిండీస్ తుది జట్టు
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్