2023 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్‌ విక్రయ ప్రక్రియ ప్రారంభించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టికెట్ ప్రైసింగ్ సంబంధించి సలహాలు ఇవ్వాలని ఆతిథ్యం ఇస్తున్న అన్ని అసోసియేషన్‌లకు సమాచారం ఇచ్చింది. 


ఆగస్టు 10 నాటికి ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈవెంట్ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులపై త్వరలోనే క్లారిటీ రానుంది. దీనిపై ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుల మధ్య చర్చ జరగనుంది. 


బీసీసీఐ కార్యదర్శి జే షా మాట్లాడుతూ.. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో షెడ్యూల్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మూడు పూర్తి సభ్య దేశాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖలు రాసి షెడ్యూల్‌లో మార్పులు చేయాలని అభ్యర్థించినట్టు తెలిపారు. 


షెడ్యూల్ మార్పు చేయాలని మూడు సభ్య దేశాలు ICCకి లేఖ రాశారు. తేదీలు, టైం మాత్రమే మారతాయి, ఆడే గ్రౌండ్ మారదు, ఆటల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంటే, దానిని 4-5 రోజులకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మూడు-నాలుగు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఐసిసితో సంప్రదింపులు జరిపి మార్పులు చేస్తామన్నారు షా.


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను కూడా రీషెడ్యూల్ చేస్తారా అని అడిగినప్పుడు, షా, "నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, కొన్ని బోర్డులు ICCకి లేఖలు రాశాయి. త్వరలో నిర్ణయం తీసుకుంటాం." అని సమాధానం చెప్పారు. 


హైప్రొఫైల్ మ్యాచ్‌కు ఎలాంటి భద్రతాపరమైన ఆందోళన లేదని షా అన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు 10 నగరాల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆడనున్నాయి.