IND vs SL 2nd ODI:
అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్‌లో టీమ్‌ఇండియా రెచ్చిపోయింది. నిర్ణయాత్మక రెండో వన్డేలో లంకేయులను వణికించింది. హైదరాబాదీ పేసుగుర్రం మహ్మద్ సిరాజ్ వేగంతో బెదరగొట్టగా.. గింగిరాలు తిరిగే బంతులతో కుల్‌దీప్ విజృంభించాడు. దాంతో శ్రీలంక 215 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్రం కుర్రాడు నువనిదు ఫెర్నాండో (50; 63 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కుశాల్ మెండిస్ (34; 34 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించాడు.
ఓపెనింగ్ భేష్!
రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్‌ఇండియాకు భారీ టార్గెట్ ఇవ్వాలనుకుంది. అందుకు తగ్గట్టే ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (20), నువనిదు ఫెర్నాండో (50) దూకుడుగా ఆడారు. చక్కని బౌండరీలతో అలరించారు. ఆరో ఓవర్ చివరి బంతికి అవిష్కను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్ ఈ జోడీని విడదీశాడు. ఆపై కుశాల్ మెండిస్ అండతో నువనిదు రెచ్చిపోయాడు. 62 బంతులో హాఫ్ సెంచరీ బాదేశాడు. రెండో వికెట్‌కు 66 బంతుల్లోనే 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ సిచ్యువేషన్లో కెప్టెన్ రోహిత్ తెలివిగా స్పిన్నర్లను రంగంలోకి దించాడు.
కుల్‌దీప్ కేక!
బంతి అందుకున్న వెంటనే మెండిస్‌ను కుల్‌దీప్ ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 102. మరో పరుగు వ్యవధిలోనే ధనంజయ డిసిల్వా (0)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 118 వద్ద నువనిదు రనౌట్ అయ్యాడు. దాంతో వికెట్ల పతనం మొదలైంది. కుల్‌దీప్ విజృంభించి చరిత్ అసలంక (15), దసున్ శనక (2)ను పెవిలియన్ పంపించాడు. వరుస బౌండరీలు బాదిన వనిందు హసరంగ (21; 17 బంతుల్లో 3x4, 1x6)ను ఉమ్రాన్ ఔట్ చేశాడు. కరుణ రత్నె (17)నూ అతడే పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో దునిత్ వెలాలిగె (32; 33 బంతుల్లో 3x4, 1x6), లాహిరు కుమార (0)ను బంతి వ్యవధిలో సిరాజ్ ఔట్ చేసేశాడు. కసున్ రజిత (17*) అజేయంగా నిలిచాడు.