AUS vs AFG ODI:  అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్. గతంలో ఆ దేశంతో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా అఫ్ఘనిస్థాన్ తో జరగాల్సి ఉన్న 2 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఈరోజు సీఏ ప్రకటించింది. దానికి కారణాలేంటంటే...


ఇప్పుడిప్పుడే అఫ్ఘనిస్థాన్ ప్రపంచ క్రికెట్ లో ఎదుగుతోంది. టీ20ల్లో ఆ జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పెద్ద జట్లతో టోర్నీలు ఆడితే అఫ్ఘాన్ క్రికెట్ భవిష్యతుల్లో మరింత మెరుగవుతోంది. అయితే ఇప్పుడు ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా అఫ్ఘనిస్థాన్ ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఆ సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఏ తెలిపింది. 


అందుకే ఈ నిర్ణయం


2021 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు అధికారం చేపట్టాక మహిళలు, అమ్మాయిలకు విద్య, ఉపాధి దూరం చేయటంతో పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పరోక్షంగా కూడా సమర్ధించేది లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్‌ వ్యాప్తికి సీఏ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, అఫ్ఘాన్ లో మహిళల క్రికెట్‌పై అంక్షలను సహించేది లేదని తేల్చిచెప్పింది.


ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని సీఏ వివరించింది. తాలిబన్‌ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిలపై అంక్షలు ఎత్తి వేస్తే వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది.