Ind vs NZ ODI Tickets: ఈ నెలలో న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది. టీ20, వన్డే సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. జనవరి 18న కివీస్- టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక. దాదాపు నాలుగేళ్ల తర్వాత భాగ్యనగరం అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడారు. 


ఈ నెల 18న హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్- టీమిండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు ఆస్వాదించేలా నిర్వహిస్తామని అజహరుద్దీన్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని టికెట్లు ఆన్ లైన్ ద్వారానే విక్రయిస్తామని స్పష్టంచేశారు. ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు పేటీఎం యాప్ ద్వారా టికెట్లు అమ్ముతామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ లో ఆసీస్- భారత్ మధ్య టీ20 మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలోనే జరిగింది. ఈ మ్యాచ్ కు జింఖానా మైదానంలో టికెట్లు విక్రయించారు. అభిమానులు పెద్ద ఎత్తున రావటంతో తొక్కిసలాట జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఈసారి టికెట్లన్నీ ఆన్ లైన్ ద్వారానే సేల్ చేస్తామని అజహర్ ప్రకటించారు. 


అందరూ ఆస్వాదించేలా నిర్వహిస్తాం


ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,112. అందులో 29,417 టికెట్లను విక్రయిస్తాం. 9,695 టికెట్లు కాంప్లిమెంటరీ పాసులు. ఒక వ్యక్తి 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేయాలి. అంతకన్నా ఎక్కువ ఒక వ్యక్తికి విక్రయించం. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే వన్డే మ్యాచ్ ను అందరూ ఆస్వాదించేలా నిర్వహిస్తాం. టికెట్ కనిష్ట ధర రూ. 850. గరిష్ట ధర రూ. 20,650. అని అజహరుద్దీన్ వివరించారు. ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేసినవారు 15వ తేదీ నుంచి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి మైదానం వద్ద టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. 


భారత్- న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్


తొలి వన్డే       జనవరి 18      హైదరాబాద్


రెండో వన్డే     జనవరి 21      రాయ్ పూర్


మూడో వన్డే    జనవరి 24       ఇండోర్


భారత్- న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్


తొలి టీ20      జనవరి 27        రాంచీ


రెండో టీ20    జనవరి 29       లఖ్ నవూ


మూడో టీ20   ఫిబ్రవరి 01     అహ్మదాబాద్