IND vs SL 2nd ODI:  శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ ఇప్పుడు రెండో వన్డేకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్ లో సమష్టిగా రాణించి గెలుపొందిన రోహిత్ సేన.. అదే ఊపు కొనసాగించి రెండో వన్డేతో పాటు సిరీస్ ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 


టాప్ భేష్


లంకతో తొలి మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ రాణించింది. మొదటి ముగ్గురు బ్యాట్స్ మెన్ పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ అందుకోగా... ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మరోసారి టాపార్డర్ మెరిస్తే లంకకు కష్టాలు తప్పవు. అయితే శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ లకు మంచి ఆరంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వీరు కూడా రాణిస్తే భారత్ కు తిరుగుండదు. తొలి వన్డే జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లు మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నారు. 


బౌలింగ్ సూపర్


తొలి వన్డేలో శ్రీలంక బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చిన పిచ్ పై భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం చూపిస్తున్న వేళ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. అతనికి మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ లు సహకరిస్తున్నారు. రెండో వన్డేలో ఈ పేస్ త్రయం రాణిస్తే లంకకు ప్రమాదమే. అక్షర్ పటేల్, చాహల్ లు స్పిన్ భారం మోయనున్నారు. 


శ్రీలంకకు సవాలే


అన్ని విభాగాల్లోనూ భీకరంగా కనిపిస్తున్న భారత్ ను అడ్డుకోవడం శ్రీలంకకు సవాలే. తొలి వన్డేలో లంక సమష్టిగా విఫలమైంది. ముందు బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వగా.. కొండంత లక్ష్య ఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ శనక, ఓపెనర్ పాతుమ్ నిశ్సాంక తప్ప మిగతావారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అయితే శనక ఫాం వారికి ఊరట. అలాగే ఫీల్డింగ్ లోనూ ఆ జట్టు నిరాశపరిచింది. రెండో వన్డేలో ఈ లోపాలన్నీ సరిచేసుకోకపోతే మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియాను అడ్డుకోవడం శ్రీలంకకు పెను సవాలే. 


పిచ్ పరిస్థితి


ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. రెండో ఇన్నింగ్స్ లో ఎక్కువ మంచు కురిసే అవకాశం ఉంది. ఈ వేదిక వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చి 5ఏళ్లు దాటిపోయింది. 


భారత్ తుది జట్టు (అంచనా)


రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్, అక్షర్, చాహల్, సిరాజ్, షమీ, ఉమ్రాన్.


శ్రీలంక తుది జట్టు (అంచనా)


పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, వనిందు హసరంగా, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.