IND vs SL, 1st ODI: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. పాత కోహ్లీని గుర్తుచేస్తూ విరాట్ అద్భుత సెంచరీ (87 బంతుల్లో 113) సాధించిన వేళ శ్రీలంక ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) రాణించటంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు సాధించింది.
ఓపెనర్ల శతక భాగస్వామ్యం
శ్రీలంకతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఈ జంట తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా.. గిల్ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. చక్కని షాట్లతో అలరించిన ఈ జోడీని ఏ లంక బౌలర్ ఇబ్బంది పెట్టలేకపోయాడు. తొలి వికెట్ కు 143 పరుగులు జోడించాక గిల్ ఔటయ్యాడు. 60 బంతులాడి 70 పరుగులు చేసిన గిల్ ను లంక కెప్టెన్ శనక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు. గిల్ ఔటయ్యాక వచ్చిన విరాట్ కోహ్లీ తాను ఎదుర్కొన్న మొదటి ఓవర్ ను ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత దూకుడు పెంచాడు. హసరంగ బౌలింగ్ లో 2 బౌండరీలు దంచాడు. అయితే తర్వాతి ఓవర్లోనే భారత్ కు షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మను మధుశంక క్లీన్ బౌల్డ్ చేశాడు. 67 బంతుల్లో 83 పరుగులు చేసిన రోహిత్ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.
విరాట్ మాయ
ఆట సగం ఓవర్లు పూర్తయిన దగ్గర్నుంచి విరాట్ మాయ మొదలైంది. పాత కోహ్లీని గుర్తు తెస్తూ కోహ్లీ తన ఆటతో మైమరపించాడు. అద్భుతమైన షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28) నుంచి చక్కని సహకారం అందింది. మధ్యలో హార్దిక్ పాండ్య (12 బంతుల్లో 14) త్వరగానే ఔటైనా కోహ్లీ దూకుడు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే 80 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇది విరాట్ కు వన్డేల్లో 45వ శతకం. సెంచరీ తర్వాత జట్టు స్కోరు పెంచే క్రమంలో 113 పరుగుల వద్ద రజిత బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత చివరి 2 ఓవర్లలో భారత్ వేగం తగ్గటంతో అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది.
శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.