India Vs SriLanka 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఈ జంట తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా.. గిల్ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. చక్కని షాట్లతో అలరించిన ఈ జోడీని ఏ లంక బౌలర్ ఇబ్బంది పెట్టలేకపోయారు. 


శతక భాగస్వామ్యం


తొలి వికెట్ కు 143 పరుగులు జోడించాక గిల్ ఔటయ్యాడు. 60 బంతులాడి 70 పరుగులు చేసిన గిల్ ను లంక కెప్టెన్ శనక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు. గిల్ ఔటయ్యాక వచ్చిన విరాట్ కోహ్లీ తాను ఎదుర్కొన్న మొదటి ఓవర్ ను ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత దూకుడు పెంచాడు. హసరంగ బౌలింగ్ లో 2 బౌండరీలు దంచాడు. అయితే తర్వాతి ఓవర్లోనే భారత్ కు షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మను మధుశంక క్లీన్ బౌల్డ్ చేశాడు. 67 బంతుల్లో 83 పరుగులు చేసిన రోహిత్ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (24 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ (6 బ్యాటింగ్) ఉన్నారు. 






టాస్ గెలిచిన లంక- మొదట భారత్ బ్యాటింగ్


భారత్- శ్రీలంక మధ్య గువాహటి వేదికగా జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం చూపనున్న కారణంగా మొదట ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నట్లు ఆ జట్టు కెప్టెన్ దసున్ శనక చెప్పాడు. 


'మేం టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. అయితే మొదటి బ్యాటింగ్ చేయడం కూడా మాకు సంతోషమే. రెండో ఇన్నింగ్స్ లో మేం మంచు ప్రభావంలో బౌలింగ్ చేయాల్సి ఉంది. నిన్నంతా పిచ్ మంచుతో నిండిపోయి ఉంది. అయితే ఈ ఏడాది ప్రపంచకప్ ఉన్నందున క్లిష్ట పరిస్థితుల్లో ఆడడం మేం అలవాటు చేసుకోవాలి. ప్రాథమిక అంశాలను విస్మరించకుండానే.. కొన్ని సమయాల్లో విభిన్నంగా ఆడడం ముఖ్యం. మేం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నాం.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.