Jasprit Bumrah to miss Sri Lanka ODIs, doubtful for Test series against Australia:


టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా పరిస్థితి అర్థమవ్వడం లేదు! ఆస్ట్రేలియా సిరీసుకూ అతడు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలిసింది. మెజారిటీ మ్యాచులకు అతడు దూరమవుతాడని సమాచారం. అతడికి మరో నెల రోజులు విశ్రాంతి అవసరమని ఎన్‌సీఏ తెలిపింది.


గతేడాది ఆగస్టు నుంచి టీమ్‌ఇండియాకు దూరం 
వెన్నెముక గాయంతో జస్ప్రీత్‌ బుమ్రా గతేడాది ఆగస్టు నుంచి టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇంటివద్దే విశ్రాంతి తీసుకున్నాడు. కాస్త కోలుకున్నాక బెంగళూరులోని ఎన్‌సీఏకే చేరుకున్నాడు. నిపుణుల సమక్షంలో రిహబిలిటేషన్‌ పొందాడు. శ్రీలంక జట్టుకు ఎంపిక చేసే ముందు ఎన్‌సీఏలో అతడు సిమ్యూలేషన్‌కు పరీక్ష ఎదుర్కొన్నాడు. అందులో విజయవంతం కావడంతో వన్డే సిరీసుకు ఎంపిక చేశారు. తాజాగా ముంబయిలో మరోసారి నెట్స్‌లో బౌలింగ్‌ టెస్టు నిర్వహించగా వెన్నెముక పట్టేసిందని బుమ్రా ఫిర్యాదు చేశాడు.


చివరి రెండు రోజుల్లోనే అతడికి వెన్నెముక పట్టేసిందా ! 
'జస్ప్రీత్‌ బుమ్రాకు ఇలా జరగడం బాధాకరం' అని తొలి వన్డేకు ముందు రోహిత్‌ శర్మ అన్నాడు. 'అతడు ఎన్‌సీఏలో చాలా కష్టపడ్డాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాక బౌలింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. చివరి రెండు రోజుల్లోనే అతడికి వెన్నెముక పట్టేసిందని తెలిసింది. బుమ్రా ఏదైనా విషయం చెబితే మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. అందుకే అతడికి విశ్రాంతి ఇవ్వడమే మంచిదని అనిపించింది. జట్టులోకి వచ్చాక అతడి పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌ ముందే అతడు గాయపడ్డ సంగతి గుర్తుంచుకోవాలి' అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.


నిబంధనల ప్రకారమే బుమ్రా ( Team India Pacer Jasprit Bumrah ) మ్యాచ్‌ సిమ్యులేషన్‌ పరీక్ష ఎదుర్కొన్నాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ముంబయిలో ఎన్‌సీఏ స్పోర్ట్స్‌ సైన్స్‌ హెడ్‌ నితిన్‌ పటేల్‌ పర్యవేక్షణలో బౌలింగ్‌ టెస్టులో పాల్గొన్నాడు. అతడి టెస్టులన్నీ గమనించాక స్కానింగ్‌ రిపోర్టులతో పోలిస్తే మరికొన్ని రోజులు రిహబిలిటేషన్‌ అవసరమని తేలింది. దాంతో బుమ్రా ఎక్కువ బౌలింగ్‌ పనిభారం తట్టుకోలేడని, చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ బీసీసీఐకి నివేదిక పంపించింది.