IND vs SL 1st ODI: 


టీమ్‌ఇండియాకు షాక్‌! శ్రీలంకతో వన్డే సిరీసుకు పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా దూరమవుతున్నాడు. అతడిని మైదానంలోకి దించే విషయంలో తొందరేమీ లేదని బీసీసీఐ భావిస్తోంది. మరికాస్త విశ్రాంతి తీసుకున్నాకే ఆడించాలని అనుకుంటోంది. దాంతో తొలి వన్డేకు వేదికైన గువాహటికి సైతం అతడిని పంపించలేదని తెలిసింది.


శ్రీలంకతో వన్డే సిరీసుకు బుమ్రాను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఇంతకు ముందు ప్రకటించింది. 'త్వరలో జరిగే శ్రీలంక వన్డే సిరీసుకు జస్ప్రీత్‌ బుమ్రాను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది' అని జనవరి 3న మీడియాకు తెలిపింది. 'అతడు రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు జాతీయ క్రికెట్‌ అకాడమీ ధ్రువీకరించింది. త్వరలోనే టీమ్‌ఇండియా వన్డే జట్టుతో కలుస్తాడు' అని వెల్లడించింది. అయితే పనిభారం దృష్ట్యా లంక సిరీస్‌ నుంచి అతడిని తప్పించాలని ఎన్‌సీఏ భావించిందని సమాచారం.


శ్రీలంక సిరీసు తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టులు ఉన్నాయి. ఆ తర్వాత కీలకమైన వన్డే ప్రపంచకప్‌ ఉంది. ముఖ్యమైన సిరీసులకు బుమ్రాను ఫిట్‌గా ఉంచాలని ఎన్‌సీఏ భావిస్తోంది. ముందు జాగ్రత్తగా లంక సిరీస్‌ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. అతడిపై వీలైనంత వరకు పనిభారం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. జనవరి 18 నుంచి ఆరంభమయ్యే న్యూజిలాండ్‌ సిరీసులకు అతడిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికై లంక సిరీస్‌ నుంచి తప్పించినట్టు బీసీసీఐ అధికారిక సమాచారం ఇవ్వలేదు.


Also Read: కోహ్లీ, బుమ్రా, రోహిత్‌ - 35 నెలల్లో కలిసి ఆడింది ఒకే వన్డే!


భారత క్రికెట్లో అత్యంత వేగంగా ఎదిగిన పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా. 2022, జులై 14న లార్డ్స్‌ వేదికగా చివరి వన్డే ఆడాడు. ఆ మ్యాచులో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది మొత్తంగా అతనాడింది కేవలం 5 వన్డేలు, 5 టీ20లు. ఆ తర్వాత వెన్నెముక గాయంతో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడలేదు. ఆలస్యంగా కోలుకోవడంతో శ్రీలంకతో టీ20లకు ఎంపిక చేయలేదు.