Rishabh Pant Salary:  అవసరమైన సమయంలో భారత క్రికెటర్ రిషభ్ పంత్ కు బీసీసీఐ అండగా నిలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు తగిన వైద్య సదుపాయాలు అందిస్తున్న బోర్డు... ఇప్పుడు అతనికి ఆర్థికంగాను అండగా నిలబడుతోంది. 


డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రసుత్తం అతనికి లిగ్ మెంట్ స్నాయువు శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీ నిర్వహించారు. ఇదంతా బీసీసీఐ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అలాగే పంత్ కు ఆర్ధికంగా అండగా నిలబడాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. 


పూర్తి శాలరీ ఇవ్వనున్న బీసీసీఐ


ప్రమాదం కారణంగా పంత్ దాదాపు 6 నుంచి 9 నెలలు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది చాలా క్రికెట్ టోర్నీలకు దూరమయ్యాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ఈ బ్యాటర్ దూరమయ్యాడు. అలాగే స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ నకు అందుబాటులో ఉండడం అనుమానమే. అయినప్పటికీ రిషభ్ పంత్ కు అతని మొత్తం శాలరీని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఐపీఎల్ ఆడనప్పటికీ పంత్ కాంట్రాక్ట్ ప్రకారం అతని రూ. 16 కోట్ల శాలరీని బోర్డు చెల్లించనుందట. అంతేకాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన రూ. 5 కోట్ల జీతాన్ని ఇవ్వనుందట. 






బీసీసీఐ ఈ ఏడాది పంత్ కు ఎంత చెల్లించనుంది?


రిషభ్ పంత్ కేంద్ర కాంట్రాక్టు పొందిన క్రికెటర్. కాబట్టి సంవత్సరానికి రూ. 5 కోట్లు చెల్లిస్తారు. ఇది కాకుండా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రూ. 16 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టును కలిగి ఉన్నాడు. అతను గాయపడి ఐపీఎల్‌లో ఆడనందున, అతని ఐపీఎల్ జీతాన్ని పూర్తిగా చెల్లించే బాధ్యతను బీసీసీఐ తీసుకుంటోంది. 
కేంద్ర కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లందరికీ బీమా ఉంది. కాబట్టి బీసీసీఐ నిబంధనల ప్రకారం, గాయాల కారణంగా ఐపీఎల్ కు దూరమైతే ఈ ఆటగాళ్లకు బోర్డు పూర్తి డబ్బును చెల్లిస్తుంది.