Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్... ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ఈ పేరు మారుమోగిపోతోంది. అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఏడాదికే పొట్టి ఫార్మాట్లో నెంబర్ 1గా ఎదిగాడు. తనకు మాత్రమే సాధ్యమైన వినూత్న షాట్లతో విరుచుకుపడుతూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. క్రీజులో అతని విన్యాసాలు చూసి అభిమానులే కాదు.. ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్ గా గుర్తింపుతెచ్చుకున్న సూర్య.. తాజాగా శ్రీలంకతో ముగిసిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో తన అరంగేట్రం, కెరీర్, తన షాట్లు, శిక్షణ, సన్నద్ధత గురించి పలు విషయాలు పంచుకున్నాడు సూర్యకుమార్య యాదవ్.


తన అంతర్జాతీయ అరంగేట్రం గురించి మాట్లాడిన సూర్య... ఆలస్యంగా జాతీయ జట్టులోకి రావడం వల్ల తనలో పరుగులు చేయాలనే ఆకలి పెరిగినట్లు చెప్పాడు. 'నా అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం అయ్యింది. అందువల్లేనేమో నాలో ఆకలి బాగా పెరిగింది. ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు మంచే చేసింది. ఆట పట్ల నా ఉత్సాహమే నన్ను నడిపించింది.' అని ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ తెలిపాడు. 


నేను అప్పుడే ఆటను ప్రారంభిస్తా


'గతేడాది నా ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాను. ఈ ఏడాది అదే కొనసాగించాలనుకుంటున్నాను. నన్ను నేను ఎప్పుడూ పాజిటివ్ గా ఉంచుకుంటాను.  జట్టు ఆటమీద ఆశలు వదిలేసుకున్న సమయంలో నేను ఆటను కొనసాగించడానికి ప్రయత్నిస్తాను. కఠిన పరిస్థితుల్లో బాగా ఆడి జట్టుకు విజయం అందిస్తే సంతోషిస్తాను అని సూర్య తెలిపాడు. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే అంత మెరుగైన ప్రదర్శన చేస్తామని' సూర్య అన్నాడు. తన ఆట వెనుక చాలా కష్టం ఉందని.. తన ప్రాక్టీస్ సెషన్లు తీవ్రతతో సాగుతాయని అన్నాడు. 


కొత్తగా ఏ షాట్లు ఆడడంలేదు 


తాను కొత్తగా ఇప్పుడు ఏ షాట్లూ ఆడడంలేదని.. కొన్నేళ్ల నుంచి ఆడుతున్నవే కొనసాగిస్తున్నానని సూర్యకుమార్ తెలిపాడు. టీ20 ఫార్మాట్లో అప్పుడప్పుడు బౌలర్ ను, బంతిని బట్టి షాట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు.  'ఈ ఫార్మాట్లో కొన్ని షాట్లు ముందే అనుకుని ఆడతాం. అయితే మరికొన్నిసార్లు అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుని షాట్లు కొట్టాల్సిన అవసరముంది. మైదానాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని నేను షాట్లు కొడతాను.' అని సూర్య తెలిపాడు.